Nandamuri TarakaRatna: తారకరత్న హెల్త్ బులిటెన్ రిలీజ్.. పరిస్థితి విషమమే!

Kaburulu

Kaburulu Desk

January 28, 2023 | 03:06 PM

Nandamuri TarakaRatna: తారకరత్న హెల్త్ బులిటెన్ రిలీజ్.. పరిస్థితి విషమమే!

Nandamuri TarakaRatna: ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి ప్రకటన వెలువడింది. ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆస్పత్రి వైద్యులు తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇప్పటికీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలిపారు. దీంతో నందమూరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తారకరత్నను గత రాత్రి (శుక్రవారం) 1 గంటకు కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకువచ్చారని ఆ బులెటిన్ లో వెల్లడించారు. అప్పటికి ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలిపారు. నిపుణులతో కూడిన తమ వైద్యబృందం ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆ బులెటిన్ లో స్పష్టం చేశారు.

ఇప్పటికీ తారకరత్న పూర్తిగా వైద్యసాయంపైనే ఆధారపడి ఉన్నారని, ముందు ముందు రోజుల్లోనూ తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నిశిత పరిశీలన, చికిత్స కొనసాగుతాయని బులిటెన్ లో వివరించారు. ఈ సమయంలో తారకరత్నను సందర్శించేందుకు ఎవరూ రావొద్దని, ఆయన చికిత్సకు ఆటంకం కలిగించవద్దని, ఆయనకి వైద్యం అందిస్తున్న నారాయణ హృదయాలయ వైద్యులు, సిబ్బంది బులెటిన్ లో విజ్ఞప్తి చేశారు.

నారాయణ హృదయాలయంలో ప్రస్తుతం తారకరత్నకు వైద్యులు క్రిటికల్ చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయనకు ఎక్మో అమర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. తారకరత్న రక్తనాళాల్లో 95 శాతం బ్లాక్స్ ఉండడంతో గుండె దాదాపు పనిచేయడం లేదని.. ఎక్మో అమర్చడం వలన శరీర భాగాలకు ఆర్టిఫీషియల్ గా రక్తం, ఆక్సిజన్ అందుతున్నట్లు చెప్తున్నారు.

ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ప్రస్తుతం తారకరత్న బాబాయి బాలకృష్ణతో పాటు తారకరత్న తల్లి, భార్య, కుమార్తెలు కూడా ఉన్నారు. శుక్రవారం రాత్రి నారా లోకేష్ వెళ్లి పరార్శించి, వైద్యులతో మాట్లాడగా.. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ కూడా బెంగళూరు వెళ్లనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ అక్కడ నుండి కుటుంబ సభ్యులకు తారకరత్నకు అందిస్తున్న వైద్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.