Jr NTR-Tarakaratna: తారకరత్న స్పందిస్తున్నారు.. పోరాటం ఫలిస్తుంది.. మీడియాతో ఎన్టీఆర్

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 01:58 PM

Jr NTR-Tarakaratna: తారకరత్న స్పందిస్తున్నారు.. పోరాటం ఫలిస్తుంది.. మీడియాతో ఎన్టీఆర్

Jr NTR-Tarakaratna: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితులపై అందరిలోనూ ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉందని తెలియడంతో నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బెంగళూరు నారాయణ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఇటు నారా-నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకోగా.. తాజాగా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీప్రణతి కూడా బెంగళూరు వచ్చారు.

వీరితో పాటు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కూడా ఆస్పత్రికి చేరుకుని తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్.. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు వెల్లడించారు. తమ కుటుంబంలో 27వ తేదీన దురదృష్టకరమైన ఘటన చోటుచేసుకుందని.. తన అన్న తారకరత్నకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని.. ఆయనకు అభిమానుల ఆశీర్వాదం, తాత ఆశీర్వాదం ఉందన్నారు.

ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నట్టుగా చెప్పిన ఎన్టీఆర్.. అందరూ ప్రార్థనలు కొనసాగించాలని, అభిమానుల ఆశీర్వాదం ఎంతో ముఖ్యమని చెప్పారు. కర్ణాటక హెల్త్ మినిస్టర్, తనకు ఆప్తులైన సుధాకర్‌‌కు ఎన్టీఆర్ ధన్యవాదాలు చెప్పారు. ఆయన కూడా ఈ పరిస్థితుల్లో తన వంతు సాయం అందిస్తున్నారని చెప్పారు. తాను తారకరత్నను చూశానని.. ఆయన స్పందిస్తున్నారని.. మంచి వైద్యం అందుతుందని తెలిపారు.

హృదయాలయ వైద్యులు మరో ఇద్దరు వైద్యులను కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారని.. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నా.. క్రిటికల్ కండీషన్ నుంచి బయటకు వచ్చినట్టుగా కాదన్నారు. చికిత్సకు స్పందిస్తున్నారని.. ఇది మంచి పరిణామని తెలిపారు. కాగా.. శనివారం నుండి ప్రచారం జరుగుతున్నట్లుగా తన సోదరుడు ఎక్మో సాయంలో లేరని.. డాక్టర్లు తనకు ధైర్యం ఇచ్చారని.. అదే ధైర్యాన్ని తాను అభిమానులకు చెబుతున్నానన్నారు. నిన్నటి నుండి తారకరత్న ఆరోగ్యంపై ఎంతో ప్రచారం జరిగినా ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడిన అనంతరం కానీ.. పూర్తిస్థాయి స్పష్టత రాలేదు.