Kavitha-Sarath Kumar: కవితతో తమిళ నటుడు శరత్ కుమార్ భేటీ.. బీఆర్ఎస్ లో చేరనున్నారా?

Kaburulu

Kaburulu Desk

January 28, 2023 | 07:02 PM

Kavitha-Sarath Kumar: కవితతో తమిళ నటుడు శరత్ కుమార్ భేటీ.. బీఆర్ఎస్ లో చేరనున్నారా?

Kavitha-Sarath Kumar: తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితతో ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ కలిశారు. శనివారం ఉదయం కవితతో శరత్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా వారు దేశ రాజకీయాల గురించి చర్చించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు లక్ష్యాలు , ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.

ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షునిగా ఉన్న ఆయన కవితతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారటంతో.. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరించే అంశంపై దృష్టిపెట్టారు. గతంలో పలువురు నేతలతో పాటు సినీ ప్రముఖులు, రైతు సంఘాల ప్రతినిధులతో కూడా కేసీఆర్ సమాలోచనలు జరిపారు. ఈ నేపథ్యంలో తాజాగా శరత్ కుమార్… కవితతో భేటీ కావటం ఇంట్రెస్టింగ్ పరిణామంగా మారింది.

కవిత-శరత్ కుమార్ భేటీ సాధారణ భేటీనా లేక రాజకీయ కోణంలోనే సమావేశం జరిగిందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, తమిళనాట బీఆర్ఎస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు పోటీ చేసేందుకు శరత్ కుమార్ ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. శరత్ కుమార్ తమిళ రాజకీయాల్లో దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు. మొదట్లో ఆయన జయలలితకు మద్దతుదారుడిగా ఉంటూ అన్నాడీఎంకేలో పనిచేసేవారు. ఆ తర్వాత డీఎంకేలో కొన్ని సంవత్సరాలు పాటు ఉన్నారు.

అక్కడ నుండి బయటకి వచ్చిన శరత్ కుమార్.. 2007లో ఆయన ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి పార్టీని ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకొని రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు. శరత్ కుమార్ ఎన్నికల్లో గెలవడం అదొక్కసారే. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించలేదు. అయితే.. బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా అన్ని రాష్ట్రాలలో పొత్తుల కోసం చూస్తున్నారనే చర్చ జరుగుతుండగా.. శరత్ కుమార్ కవితను కలవడం ఆసక్తిగా మారింది.