Priyanka Gandhi: తెలంగాణ నుండి ప్రియాంకా గాంధీ పోటీ?.. ఏ నియోజకవర్గమంటే?

Kaburulu

Kaburulu Desk

January 22, 2023 | 12:20 PM

Priyanka Gandhi: తెలంగాణ నుండి ప్రియాంకా గాంధీ పోటీ?.. ఏ నియోజకవర్గమంటే?

Priyanka Gandhi: తెలంగాణ రాజకీయాల్లో వచ్చే ఎన్నికలలో సంచలనం జరగబోతుందా అనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ గడ్డ నుంచి ప్రధాని మోదీ పోటీకి సిద్దమవుతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో దక్షిణాది నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ప్రధాని.. అందులో భాగంగా తెలంగాణ నుంచి రెండు లోక్ సభ స్థానాల పైన సర్వేలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అతి పెద్ద లోక్ సభ నియోజకవర్గం మల్కాజ్ గిరి.. వెనుకబడిన మహబూబ్ నగర్ లోక్ సభ స్థానాలలో ఒక చోట నుండి మోడీ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగానే ఇప్పుడు గాంధీ కుటుంబం నుండి కూడా తెలంగాణలోనే పోటీ ఛాన్స్ ఉందని మరో ప్రచారం మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి రాష్ట్ర నాయకులు గాంధీ కుటుంబానికి చెందిన వారిలో ఒకరిని ఇక్కడ పోటీ చేయించేలా ఓ కొత్త వ్యూహానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.

గతంలో ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందగా.. ఇక్కడ ఆమె చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ఆమెను గుర్తు చేస్తుంటాయి. 1980లో ఉత్తరాధిలో కాంగ్రెస్ హవా కొనసాగుతుండడంతో దక్షణాది నుండి తెలంగాణను ఎంచుకొని మెదక్ పార్లమెంట్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి 2 లక్షల మెజారిటీతో గెలిచారు. అనంతరం ఇందిరాగాంధీ మెదక్ లో కొన్ని అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టారు.

1984 జూలై 19న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్పంచుల సదస్సుకు కూడా హాజరైన ఇందిరా.. అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అలాగే సంగారెడ్డిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొనడం.. మెదక్ మున్సిపల్ కాంప్లెక్స్ తదితర అభివృద్ధి పనులు చేయించడం వంటివి కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

ఈ క్రమంలోనే గాంధీ కుటుంబం నుండి మళ్ళీ ఒకరిని మెదక్ నుండి బరిలో దింపి రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని భావిస్తున్నారట. అందునా ఇందిరాగాంధీతో దగ్గర పోలికలుంటూ.. ఆమెను గుర్తుచేసే ప్రియాంక గాంధీ అయితే.. కలిసి వస్తుందని భావిస్తూ అధిష్టానానికి సంకేతాలు పంపించగా అందుకు ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లు చెప్తున్నారు. మరి అప్పటికి సమీకరణాలు ఎలా ఉంటాయో.. రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.