YS Sharmila: బతుకమ్మ ఆడుతూ లిక్కర్ అమ్ముతున్నావా?.. కవితపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు!

Kaburulu

Kaburulu Desk

March 3, 2023 | 04:46 PM

YS Sharmila: బతుకమ్మ ఆడుతూ లిక్కర్ అమ్ముతున్నావా?.. కవితపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు!

YS Sharmila: దైవ కార్యక్రమం బతుకమ్మ ఆడుతూనే.. లిక్కర్ స్కామ్ చేశావా అంటూ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వివాదాస్పద విమర్శలు చేశారు. అంతేకాదు, బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన మీరు, మహిళలకే తలవంపు తెచ్చారు. లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి బిడ్డ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ కొత్తరాగం అందుకోవడం విడ్డూరంగా ఉందని చురకలంటించారు. బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్టుందని సెటైర్లు వేశారు.

ఈ మధ్య కాలంలో షర్మిల సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా విమర్శలకు దిగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా షర్మిల వరస ట్వీట్లతో కవితపై విరుచుకుపడ్డారు. కవిత బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడినట్లు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు, మహిళలకు 33% సీట్లు ఎందుకు కేటాయించలేదని కవితపై షర్మిల మండిపడ్డారు.

2014 ఎన్నికల్లో రెండు సీట్లు.. అంటే 11.76%.. ఇదేనా మహిళలపై మీకున్న ప్రేమ? అని ప్రశ్నించారు. తెలంగాణ తొలి క్యాబినెట్ లో మహిళలకు చోటు లేదు.. ఇప్పుడున్న క్యాబినెట్ లో పట్టుమని ఇద్దరు మంత్రులు. ఇదేనా మహిళలపై మీకున్న మక్కువ? మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో మీ తండ్రి గారికి వచ్చిన అడ్డంకి ఏంటి? అని నిలదీశారు. అంతేకాదు, కవిత ఢిల్లీలో దీక్ష చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా స్పందించిన షర్మిల.. మీరు దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. ప్రగతిభవన్ ముందు.. ఫామ్ హౌజ్ ముందని ఎద్దేవా చేశారు.