AP Govt: జీవో నెంబర్ 1 రగడ.. సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు

Kaburulu

Kaburulu Desk

January 20, 2023 | 01:47 PM

AP Govt: జీవో నెంబర్ 1 రగడ.. సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు

AP Govt: ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 రగడ కొనసాగుతూనే ఉంది. నెల్లూరు జిల్లా కందుకూరు.. గుంటూరులో టీడీపీ తలపెట్టిన కార్యక్రమాలలో 11 మంది కార్యకర్తలు మృతి చెందడంతో ఏపీ ప్రభుత్వం సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో 1 తీసుకొచ్చింది. 1861 పోలీస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 30 ప్రకారం.. రోడ్లపై ప్రదర్శనలు, కార్యక్రమాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

టీడీపీతో పాటు జనసేన, కమ్యూనిస్టులు జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసులు అడుగడునా అడ్డుకోగా తీవ్ర దుమారం రేగింది. దీంతో జీవో నెంబర్-1ను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే జీవో నెంబర్-1ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో సీపీఐ రామకృష్ణ పిటిషన్‌ దాఖలు చేశారు.

జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. జీవో నెంబర్ 1పై ఈ నెల 23 వరకూ సస్పెన్షన్ విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. జీవో నెంబర్ 1పై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ తరుణంలో తాము జోక్యం చేసుకోలేమని కూడా ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారణ జరిపించాలని ఆదేశించింది. అయితే.. సాధారణంగానే ఈ నెల 23వ తేదీన ఈ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ ఉంది. హైకోర్టులో విచారణ అనంతరం మళ్ళీ సుప్రీంకోర్టు విచారణ చేసే అవకాశం ఉంది. అప్పుడు హైకోర్టులో తీర్పు ఎలా ఉండబోతుందో.. సుప్రీం దానికి ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.