Nara Lokesh: గడువు ముగుస్తుంది.. అసెంబ్లీకి దూరం కావాల్సి వస్తున్న నారా లోకేష్

Nara Lokesh: టీడీపీ అగ్రనేత నారా లోకేష్ అసెంబ్లీకి దూరం కావాల్సి వస్తుంది. మరో నెల రోజులలోనే ఆయన పదవీ కాలం ముగియనుంది. మళ్ళీ పదవి దక్కే అవకాశం, బలం లేకపోవడంతో ఆయన అసెంబ్లీకి దూరం కావాల్సి వస్తుంది. ఒక్క లోకేష్ కు మాత్రమే కాదు.. ప్రస్తుతం ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలు, తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది.
ఏపీ విషయానికి వస్తే నారా లోకేశ్ తో పాటు బచ్చుల అర్జునుడు, పోతుల సునీత, గంగుల ప్రభాకర్ రెడ్డి, చల్లా భగీరథరెడ్డి, పెన్మత్స సూర్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్ ల పదవీకాలం ముగియనుంది. వీరిలో చల్లా భగీరథరెడ్డి గతేడాది మరణించగా.. మిగతా వాళ్ళ పదవీకాలం మార్చి నెలాఖరుకి పూర్తవుతుంది. ఇక, తెలంగాణలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, నవీన్ రావు, గంగాధర్ రావుల పదవీకాలం ముగియనుంది. అన్ని స్థానాలకు కలిపి ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరణ, మార్చి 14న నామినేషన్ల పరిశీలనా.. మార్చి 23న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. కాగా, మొత్తం 14 నియోజకవర్గాలకు ఈ మార్చి నెలలో పోలింగ్ జరుగనుంది. ఇందులో స్థానిక సంస్థలు-9, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు-5 ఉన్నాయి.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఏకగ్రీవ విజయాలను ఖాయం చేసుకుంది. ఇప్పటికే అయిదు చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఎమ్మెల్యేల కోటాలో ఏడు స్థానాలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. ఈ ఏడు స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్తాయి. దీంతో మార్చి నెలాఖరు నాటికి శాసన మండలిలో వైసీపీ బలంగా భారీగా పెరగనుంది.