Maha Shivarathri 2023: శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేది ఎప్పటి నుండో తెలుసా…!

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 11:06 AM

Maha Shivarathri 2023: శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేది ఎప్పటి నుండో తెలుసా…!

హిందూధర్మంలోని పవిత్రమైన మాసాలలో ఒకటి మాఘమాసం. ఈ మాసంలో వచ్చే అనేక పర్వదినాలలో ఒకటి మహాశివరాత్రి. హిందువులు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి. ఈరోజునే లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు శివ, పార్వతుల వివాహం కూడా ఈ రోజే జరిగిందని శాస్త్రీయ పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ పర్వదినం ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందో, ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయో వంటి విశేషాలను ఇపుడు తెలుసుకుందాం.

మహాశివరాత్రి రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజుగా భావించి భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీ శనివారం నాడు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో శైవ క్షేత్రాలు శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న, భ్రమరాంబల కల్యాణానికి.. బ్రహ్మోత్సవాలను ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు.

శ్రీశైలం దేవస్థానంలో ఫిబ్రవరి 11 నుంచి 21 వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆలయ అధికారులు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని ఈవో లవన్న తెలిపారు. కృష్ణ దేవరాయగోపురం, అమ్మవారి ఆలయం , కల్యాణ మండపం, నాగులకట్ట, శ్రీస్వామివారి నిత్య కల్యాణ మండపం వంటి స్థలాలను పరిశీలించారు.