BRS Party: నేడు బీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ విందు.. ప్రగతిభవన్‌లో పార్లమెంటరీ సమావేశం

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 11:17 AM

BRS Party: నేడు బీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ విందు.. ప్రగతిభవన్‌లో పార్లమెంటరీ సమావేశం

BRS Party: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్‌లో ఈ పార్లమెంటరీ సమావేశం జరుగనున్నది. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే కేంద్ర బడ్జెట్‌ సమావేశాల్లో పార్టీ అనుసరించే వ్యూహంపై సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్‌లో చర్చింబోయే అంశాలు, బడ్జెట్‌లో కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలు తదితర అంశాలపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. ఈ లంచ్ తర్వాతే పార్లమెంటరీ సమావేశం జరుగనుంది.

కాగా, 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. రెండు విడతల్లో జరుగనున్న ఈ సమావేశాలు ఏప్రిల్‌ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఇప్పటికే వెల్లడించారు. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనుండగా.. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచుతారు.

అనంతరం రెండో రోజు అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు? మొత్తం బడ్జెట్ ఎంత విలువ ఉండనుంది? ఏ రాష్ట్రానికి ఏ రంగంలో నిధులు కేటాయించనున్నారు? అందునా తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఉంటాయా? ఇలా ఎన్నో రకాలుగా చర్చలు సాగుతున్నాయి.

ఈక్రమంలోనే పార్టీ టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారిన తర్వాత జరుగనున్న తొలి సమావేశం ఇదే కాగా.. బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిసారి జరగనున్న పార్లమెంట్ సమావేశాలు కూడా ఇవే కావడంతో జాతీయ పార్టీగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు వ్యవహరించాల్సిన తీరు, మాట్లాడాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ తమ పార్టీ పార్లమెంట్ సభ్యులకు దిశానిర్ధేశం చేయనున్నారు.