Srisailam: మల్లన్న సన్నిధిలో మరో వివాదం.. పాలకమండలి సభ్యురాలి ఆడియో వైరల్

Kaburulu

Kaburulu Desk

January 21, 2023 | 01:57 PM

Srisailam: మల్లన్న సన్నిధిలో మరో వివాదం.. పాలకమండలి సభ్యురాలి ఆడియో వైరల్

Srisailam: గత ఆరు నెలలుగా శ్రీశైలం మల్లన్న దేవస్థానంపై విమర్శల జడివాన కురుస్తుంది. ట్రస్ట్ బోర్డు సభ్యులు రెండు వర్గాలు విడిపోయి.. ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడంతో అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ట్రస్ట్ బోర్డు లెటర్ ప్యాడ్ లు, బోర్డు సభ్యుల రెకమెండేషన్లతో కొందరు టికెట్లు లేకుండానే మల్లన్న దర్శనాలకు వెళుతున్నట్లు భారీ విమర్శలు వినిపిస్తున్నాయి.

మొన్నటికి మొన్న లడ్డూల తయారీ ముడి సరుకుల కొనుగోలులో అక్రమాలు జరిగాయని సాక్షాత్తు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. అయితే అంతలోనే దేవస్థానం, పాలక మండలిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అదే ట్రస్ట్ బోర్డు మెంబర్లు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డికి వ్యతిరేకంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు ఓ సభ్యుడు ధర్మరాజు హనుమంత్ నాయక్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చైర్మన్ పై తిరిగి ఆరోపణలు చేశారు.

దీంతో అసలు శ్రీశైలం మల్లిఖార్జున స్వామి వారి సన్నిధిలో ఏం జరుగుతుందోనని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీశైలం పాలకమండలిలో రెండు వర్గాలుగా మారిందని స్థానిక రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు బోర్డు సభ్యులే ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తుండగానే శ్రీశైలంకు సంబంధించి ఓ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

గర్భాలయ అభిషేకాలు చేయించుకునే భక్తులు ఎవరైనా ఉంటే పార్టీలను పట్టుకురా అంటూ ఓ సభ్యురాలు మద్యవర్తులతో సంభాషణ జరిపినట్లుగా ఓ ఆడియో బయటకు వచ్చింది. స్వామివారి గర్భాలయ అభిషేకం టికెట్లు లేకపోయినా.. గర్భాలయ అభిషేకాలు చేయిస్తామంటూ ఓ పాలకమండలి సభ్యురాలు బ్రోకర్లతో మాట్లాడినట్లుగా ఈ ఆడియో వైరల్ అవుతోంది. శ్రీశైలంలో పాలక మండలి సభ్యురాలి అక్రమ సంపాదన అంటూ దీనిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

ఆడియో విన్న మల్లన్న భక్తులు సోషల్ మీడియాలో కామెంట్లతో ఏకిపారేస్తున్నారు. మల్లికార్జునస్వామి దర్శనాల పేరుతో ఒకవైపు దళారుల దందా చేస్తుంటే.. పాలక మండలి సభ్యులే దళారులతో కలిసి భక్తులకు ఎర వేస్తూ మల్లన్న ఆదాయానికి గండి కొడుతున్నారని తిట్టిపోస్తున్నారు. దేవుని సేవ ముసుగులో దేవుని ఆదాయానికి గండి కొడుతున్నారని.. ధర్మకర్తల ముసుగులో అధర్మంగా అక్రమాలకు పాల్పడుతున్నారని విపరీతంగా విమర్శలు చేస్తున్నారు.