Tribal Festival Nagoba Jatara Ends In Keslapur: ముగిసిన నాగోబా జాతర… ఆరు లక్షల మంది భక్తులు హాజరు!

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 10:37 AM

Tribal Festival Nagoba Jatara Ends In Keslapur: ముగిసిన నాగోబా జాతర… ఆరు లక్షల మంది భక్తులు హాజరు!

ఆదిలాబాద్‌జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని గోండు గిరిజనతెగకు చెందిన మెస్రం వంశస్తులు జరిపే అతి పెద్ద గిరిజన మేళ నాగోబా జాతర. ఆదివాసీల కుంభమేళగా పేరుగాంచిన నాగోబా జాతర అట్టహాసంగా ముగిసింది. అత్యంత వైభవంగా వారం రోజులపాటు పూజలందుకున్న నాగోబా దేవతకు మండగాజిలి పూజలతో ముగింపు పలికారు. అక్కడి నుంచి మెస్రం వంశీయులు శ్యాంపూర్‌ బుడుందేవ్‌ పూజలకు బయల్దేరి వెళ్లారు.

ఈ జాతర ఆదివాసీల సమైక్యతను చాటుతుంది. అప్పటి వరకూ చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండే ఆదివాసీ, గోండు, కోలామి, పరదాస్, మెస్రం వంశీయులంతా ఈ జాతరలో ఒక్కచోటికి చేరుతారు. వీరంతా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, బీహార్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కెస్లాపూర్‌కు చేరుకోవడంతో జాతర సందడి నెలకొని గ్రామమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఈ యేడాది నాగోబా జాతరకు సుమారు 6 లక్షలకుపైనే భక్తులు వచ్చినట్లు అంచనా వేశారు.

ఈనెల 21న అర్థరాత్రి గంగాభిషేకంతో మొదలైన నాగోబా జాతర, ప్రజాదర్బార్‌, బేటింగ్‌ల వంటి ప్రధాన ఘట్టాలతో 28వ తేదీ వరకూ వైభవంగా కొనసాగింది. మట్డితో మెస్రం ఆడపడుచులు చేసిన ఏడు రకాల పాముల పుట్టలకు జాతర సమయంలో ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో నాగోబా అనుగ్రహం కలుగుతుందని మెస్రం వంశీయులతో పాటు ఆదివాసులు నమ్ముతారు.