Komatireddy Venkat Reddy: నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు.. ఎంపీ కోమటిరెడ్డి ఫిర్యాదు!

Kaburulu

Kaburulu Desk

March 11, 2023 | 08:50 PM

Komatireddy Venkat Reddy: నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు.. ఎంపీ కోమటిరెడ్డి ఫిర్యాదు!

Komatireddy Venkat Reddy: కొంతమంది తనను చంపుతామని బెదిరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసినా.. సొంత పార్టీ నేతలని బెదిరించినా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత కుమారుడికి ఫోన్ చేసే చంపేస్తానని బెదిరించారు.

నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్‌ను ఎంపీ కోమటిరెడ్డి ఫోన్‌లో బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెరుకు సుధాకర్‌ను చంపేందుకు వంద కార్లలో తిరుగుతున్నారంటూ ఆయన బెదిరింపులకు గురి చేశారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి ఆ వాయిస్ నాదేనని.. నేనే ఫోన్ చేసి మాట్లాడానని కూడా ఒప్పుకున్నారు.

అయితే ఇందుకు సంబంధించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే తప్ప దీని వెనకాల వేరే ఉద్దేశం లేదని తెలిపారు. అదలా ఉండగానే ఎంపీ కోమటిరెడ్డి తనను కూడా చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. సోషల్ మీడియాలో తనను హత్య చేస్తామంటూ కొందరు వీడియోలు పోస్ట్ చేశారని వెంకట్ రెడ్డి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

తన వద్ద ఉన్న వీడియోలు, చాటింగ్ లిస్ట్‌ను పోలీసులకు అందించారు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. నిందితులను గుర్తించేందుకు విచారణ చేపట్టారు. వెంకటరెడ్డి అందించిన ఆధారాల ప్రకారం నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఒకపక్క కోమటిరెడ్డే సొంత పార్టీ నేతనే చంపుతామని బెదిరించడం.. ఇప్పుడు మళ్ళీ తననే చంపుతామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ చేయడం ఆసక్తిగా మారింది.