TS Congress: కాంగ్రెస్ ధర్నాకి ముహూర్తం ఒకే.. నేతలే కలిసి వస్తారా?

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 10:35 AM

TS Congress: కాంగ్రెస్ ధర్నాకి ముహూర్తం ఒకే.. నేతలే కలిసి వస్తారా?

TS Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు పంచాయతీ నిధుల దారి మళ్లింపుపై ధర్నాకి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈనెల 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద గల ధర్నా చౌక్‌ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరగనుంది. ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నట్లు తెలిసింది.

నిజానికి ఈ ధర్నా వెనక పెద్ద హైడ్రామా నడిచింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ నిధులను దారి మళ్లించారని విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ నిధులు లేక సర్పంచ్ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించింది. దీనిపై హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద ధర్నాకు కూడా ప్లాన్ చేసింది. అయితే.. దీనికి పోలీసులు అనుమతి లేదని ఎక్కడిక్కడే కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీంతో కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. సర్పంచులకు అండగా తాము చేపట్టే ధర్నాను ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా అడ్డుకున్నారని పిటిషన్ వేసింది. తమ నిరసనకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరింది. దీనికి కోర్టు కూడా సానుకూలంగా స్పందించి కొన్ని షరతులతో ధర్నాకి ఒకే చెప్పింది. ఇక, పోలీసులు చేసేదేం లేక కాంగ్రెస్ పార్టీ ధర్నాకి అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఈనెల 9న కాంగ్రెస్ పార్టీకి సిద్ధమైంది.

అయితే.. ఈ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ నేతల నుండి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ వర్గాన్ని సీనియర్ నేతలలో కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వీరంతా అటు పార్టీ పదవుల నుండి ఇటు పార్టీ కార్యక్రమాల వరకు అన్నిటిలో రేవంత్ వర్గాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసమే మరో మూడు రోజులలో పార్టీ కొత్తగా నియమించిన వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రే రాష్ట్రానికి రానుండగా ఈలోగానే ఈ ధర్నాకి సిద్ధమైంది. దీంతో ఈ ధర్నాకి నేతలు కలిసి వస్తారా? లేక పార్టీలో ఇది మరో వివాదం అవుతుందా అన్నది చూడాల్సి ఉంది.