Tiger Cubes: దారితప్పి ఊర్లోకొచ్చిన పులి కూనలు.. తల్లి కూడా వస్తుందని గ్రామాస్తుల భయాందోళన!

Tiger Cubes: తల్లి నుంచి విడిపోయి దారితప్పిన నాలుగు పెద్ద పులి పిల్లలు గ్రామంలోకి వచ్చేశాయి. ముళ్ల పొదల నుండి శబ్దాలు రావడంతో ఓ యువకుడు వెళ్లి చూడగా పులి కూనలు కనిపించాయి. శునకాలు వాటిని చూస్తే చంపేస్తాయని భావించిన గ్రామస్థులు పులి పిల్లలను పట్టుకుని తీసుకెళ్లి ఓ గదిలో బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ శివారులో జరిగిందీ ఘటన.
సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ అలాన్ చోంగ్ టెరాన్, సున్నిపెంట బయోడైవర్సిటీ రేంజ్ అధికారి మహ్మద్ హయత్ పులి పిల్లలను పరిశీలించారు. తల్లి నుంచి విడిపోయి చాలా సమయం కావడంతో పాలు అందక బాగా నీరసించిపోయినట్టు గుర్తించారు. ఐస్క్రీం, సెరెలాక్, పాలు వంటివి వాటి ముందు పెట్టినా అవి ముట్టలేదు. దీంతో వాటిని అడవికి తీసుకెళ్లి వదిలిపెట్టినా కదల్లేదు.
దీంతో ఆత్మకూరు మండలంలోని బైర్లూటి పశు వైద్యశాలకు తరలించి వైద్యం అందిస్తున్నట్లు శ్రీశైలం ఎఫ్ఆరోవో మొహమ్మద్ హయాత్ తెలిపారు. పులి పిల్లలకు పాలు, ఓఆర్ఎస్ నీళ్లు పట్టారు. కాగా, తల్లిపులి తన పిల్లలతో కలిసి ఆదివారం రాత్రి ఈ ప్రదేశానికి వచ్చి ఉంటుందని.. కుక్కల అరుపులు, జనాల శబ్దాలు విని భయపడి తల్లి, పిల్లలు వేరై ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు.
త్వరలోనే పిల్లలను తల్లితో కలిపేందుకు ప్రయత్నిస్తామని అధికారులు చెప్పారు. కాగా, పెద్దగుమ్మడిపురంలో పులి పిల్లలు ఉన్నాయని ప్రచారం జరగడంతో చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. సాధారణంగా నెలలోపు వయసున్న కూనలను వదిలి తల్లిపులి ఉండలేదని, దానికి ఏదైనా అపాయం జరిగిందేమో అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, పులి పిల్లలు ఇక్కడే పులి నుండి విడిపోతే వాటి తల్లి కూడా సమీపంలోనే ఉంటుందని మరికొందరు గ్రామస్థులు భయపడుతున్నారు.