Trending Marriage: గోదారోళ్లా మజాకా.. గుర్రాల రథంలో పెళ్లి కొడుకు.. అమ్మాయిలు చీరకట్టి బుల్లెట్లపై స్వాగతం!

Trending Marriage: గోదారోళ్లంటేనే ఓ ప్రత్యేకం. వెటకారమైనా.. మమకారమైనా.. అభిమానమైనా.. ఆప్యాయతైనా.. మర్యాదలైనా.. గోదారోళ్ల గురించి చెప్పాలంటే.. అబ్బో.. అంటూ మొదలుపెడతారు. అల్లుళ్లకు, అత్తమామలకు, వియ్యంకులకు, బంధువులకు మర్యాదలు చేయాలంటే వారి తర్వాతే. పెళ్లి భోజనం దగ్గర నుంచి.. అల్లుడికి ఆషాడం సారె పంపే వరకు కూడా ఓ ప్రత్యేకత చాటుతారు. ఇక, పెళ్లిళ్ల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. దానికి ఉదాహరణే ఈ పెళ్లి.
కోనసీమ ప్రకృతి అందాలకు హరివిల్లు ఆహ్లాదకరమైన పచ్చ పచ్చని పైర్లు, ఆకు పచ్చని కొబ్బరి చెట్లు.. వాటి చుట్టూ కాలువలు, అక్కడక్కడ అందమైన గోదావరీ నదీ.. పారే సెలయేర్లు, దానికి మించి గోదారోళ్ల వినూత్న పెళ్లిళ్ల సందడి అంతా ఇంతా కాదని చెప్పాలి. పంజాబీ వేషధారణలో మేళ తాళాలతో పెళ్లి కొడుకు జోడు గుర్రాల రథంలో రాజకుమారుడిలా ఊరేగుతుంటే.. మహారాష్ట్ర తరహాలో అమ్మాయిలు చీరకట్టులో బుల్లెట్ బైకులపై పెళ్లికుమారుడికి స్వాగతం పలికారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మామిడికుదురు గ్రామంలో జరిగిన గోకవరపు వారి కల్యాణ వేడుక కన్నుల పండగను మించి ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. అవినాష్, లక్ష్మి ఒక్కటైన ఈ పెళ్లి వేడుకలో వినూత్న ఊరేగింపు, బాణాసంచాలు, పంజాబీ మేళాలు, తాళాలు, రాజులు కాలం నాటి జోడు గుర్రాల రథంపై పెళ్ళి కొడుకు ఊరేగింపులు ఇలా ఒక్కటేమిటీ మాటల్లో చెప్పలేని వైవిధ్యంగా సాగింది.
అన్నిటికి మించి బుల్లెట్ల బైకులపై మహారాష్ట్ర సంస్కృతిలో వస్త్రధారణ చేసిన యువతులు రథంపై పెళ్లి కొడుకు ఊరేగింపులు పల్లెవాసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. కోనసీమ జిల్లాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేయడం చూశాం కానీ.. వైవిధంగా చేసిన ఇలాంటి వివాహం ఈమధ్య కాలంలో చూడలేదంటున్నారు స్థానికులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.