Wedding Card Distribution: హెలికాఫ్టర్లో వెళ్లి పెళ్లి కార్డులు పంచిన హైదరాబాద్ వ్యాపారవేత్త

Wedding Card Distribution: జుట్టు ఉండాలే కానీ ఏ కొప్పు అయినా పెట్టొచ్చని ఓ పాత సామెత వినే ఉంటారు కదా. జుట్టు ఉంటే ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా చేసుకోవచ్చని.. జుట్టు లేకపోతే ఏమీ చేయలేమని అలా చెప్పారు. అలాగే డబ్బు ఉండాలే కానీ.. కొండ మీద కోతైనా దిగి వస్తుందని అంటుంటారు. కొండ మీద కోతి ఏమో కానీ.. ఎక్కడ మాత్రం డబ్బు కొడితే గాల్లో ఎగిరే హెలికాఫ్టర్ కూడా తన ముందు వాలిపోయింది. ఆ హెలికాఫ్టర్ లోనే వెళ్లి పెళ్లి శుభలేఖలు పంచి వచ్చాడో బిజినెస్ మెన్.
హైదరాబాద్ లోని ఖైరతాబాద్కు చెందిన మధు యాదవ్ అనే వ్యాపారి దూద్వాలా పేరుతో డైరీ ఫాం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9న అతడి తమ్ముడు చందు యాదవ్ పెళ్లి నిశ్చయం కాగా.. బంధువులకు పెళ్లి పత్రికలు పంపిణీ చేయటం ప్రారంభించాడు. నగరంలోని బంధుమిత్రులందరికీ స్వయంగా వెళ్లి పత్రికలు అందజేశాడు. అయితే మధు యాదవ్కు ముంబైలోనూ బంధువులు, మిత్రులు ఉన్నారు. వారికి కూడా స్వయంగా వెళ్లి తమ్ముడు పెళ్లి పత్రికలు అందజేయాలనుకున్నాడు.
అంతే, అప్పటికప్పుడు ఒక హెలికాఫ్టర్ బుక్ చేసుకున్నాడు. శుభలేఖలు ఇచ్చేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాదు నుంచి ముంబయి వెళ్లారు. అక్కడ బంధుమిత్రులందరికీ పెళ్లి కార్డులు ఇచ్చి ఆహ్వానించారు. వాట్సప్ మెసేజ్ల రూపంలోనో.. కొరియర్ ద్వారానో ఆహ్వాన పత్రికలు పంపిస్తున్న ఈ రోజుల్లో ఇలా హెలికాప్టర్ బుక్ చేసి శుభలేఖలు పంచి మధు యాదవ్ తన తమ్ముడిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.
హెలికాఫ్టర్ లో వెళ్లి శుభలేఖలు పంచిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ సందడి చేస్తోంది. పెళ్లి పత్రికలు పంచేందుకే ఇలా హెలికాప్టర్లో వెళ్తే.. ఇక, పెళ్లికి ఏ రేంజ్లో ఏర్పాట్లు చేస్తాడో.. పెళ్లి ఎంత ఘనంగా చేస్తారోనని అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.