Husband Kidney sale For Divorce: విడాకులకు భార్య రూ.10 లక్షల డిమాండ్.. కిడ్నీ భేరం పెట్టిన భర్త!

Husband Kidney sale For Divorce: పాపం ఆ భర్త ఎంత ఆవేదన చెందాడో కానీ.. ఏది ఏమైనా తన భార్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. కానీ.. ఆ భార్యేమో తాను విడాకులు ఇవ్వాలంటే తనకి రూ.10 లక్షలు భరణం ఇస్తేనేనని తెగేసి చెప్పింది. తన దగ్గర అంత డబ్బు లేకపోయినా ఏది ఏమైనా భార్యను వదిలించుకోవాలని డిసైడ్ అయిన భర్త ఏకంగా తన కిడ్నీని బేరం పెట్టేశాడు. అది కూడా ఫ్లెక్సీ చేయించి మరీ రోడ్ల మీద ప్రచారం చేస్తున్నాడు.
హార్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగింది ఈ ఘటన. ‘నా మూత్ర పిండం అమ్మకానికి సిద్ధంగా ఉంది’. ‘మార్చి 21న నా ఆత్మాహుతి కార్యక్రమం’ అని రాసి భార్యతో కలిసి, విడివిడిగా ఉన్న ఫొటోలతో కూడిన ఓ బ్యానర్‌తో తిరుగుతున్నాడో వ్యక్తి. రోడ్డుపై బ్యానర్‌తో అతడిని చూసిన కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది.
ఆ వ్యక్తి బ్యానర్‌ను పట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడన్న విషయం తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాలి. బిహార్ రాజధాని పట్నాకు చెందిన సంజీవ్.. ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తుంటాడు. అతడికి ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత కొద్ది రోజుల్లోనే సంజీవ్‌కు కష్టాలు మొదలయ్యాయి. భార్య తరుచూ గొడవకు దిగుతూ సూటిపోటి మాటలతో వేధించేది. అంతేకాదు, అతడిపైనే వరకట్న వేధింపులు కేసు పెట్టడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చిన అతడికి భార్య భార్య, బావమరిది, అత్తమామల నుంచి వేధింపులు రోజురోజుకు పెరిగిపోయాయి. దీంతో ఏది ఏమైనా విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయిన భర్త మార్చి 21 లోగా కిడ్నీ విక్రయిస్తే ఆ డబ్బులు ఆమెకు ఇచ్చేస్తానని, ఒకవేళ అలా జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఫ్లెక్సీతో ప్రచారం చేస్తూ సంజీవ్ వాపోయాడు. ఒకవేళ తన కిడ్నీని ఎవరూ కొనకపోతే ఆత్మహత్యే శరణ్యమని తెగేసి చెప్తున్నాడు. మరి.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కనుక పోలీసులు దీనిపై ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.