Viral News: 500 మంది అమ్మాయిల మధ్యలో ఒక్కడే అబ్బాయి.. స్పృహ తప్పి పడిపోయాడు!

Kaburulu

Kaburulu Desk

February 2, 2023 | 04:05 PM

Viral News: 500 మంది అమ్మాయిల మధ్యలో ఒక్కడే అబ్బాయి.. స్పృహ తప్పి పడిపోయాడు!

Viral News: చుట్టూ ఎటు చూసినా అమ్మాయిలే కనిపిస్తున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. హాళ్ళో సుమారు 500 మందికి పైగా అమ్మాయిలు ఉన్నారు. అదే హాళ్ళో ఒక్కడే అబ్బాయి. దీంతో కాసేపు అబ్బాయి విపరీతంగా టెన్షన్ పడ్డాడు. క్రమేపీ కంగారు ఎక్కువై స్పృహతప్పి పడిపోయాడు. బీహార్‌లోని నలందా జిల్లాలో జరిగిందీ ఘటన. అసలు విషయం ఏంటంటే.. బుధవారం నుండి బీహార్ లో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

బుధవారం గణిత పరీక్ష కాగా.. మనీశ్ శంకర్ ప్రసాద్ అనే 17 ఏళ్ల విద్యార్థి కూడా పరీక్ష రాసేందుకు సిద్దమయ్యాడు. అల్లామా ఇక్బాల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న మనీశ్ శంకర్ కు సుందర్‌గఢ్‌లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూలును ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు. శంకర్ పరీక్ష రాసేందుకు హాల్లోకి వెళ్లగానే లోపల పెద్ద సంఖ్యలో అమ్మాయిలు కనిపించారు. 500 మందికి పైగా అమ్మాయిలను చూసిన శంకర్ ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడ్డాడు.

స్కూలు సిబ్బంది వెంటనే అతడిని సదర్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స అనంతరం కొన్ని గంటల తర్వాత మనీశ్ కోలుకున్నట్టు ఆయన తండ్రి సచ్చిదానంద ప్రసాద్ తెలిపారు. పరీక్షహాల్లో 500 మంది అమ్మాయిల మధ్య శంకర్ ప్రసాద్ ఒక్కడే అబ్బాయి కావడంతో కంగారు పడి కుప్పకూలిపోయినట్టు ఆయన తండ్రి తెలిపారు. అది నిజానికి అమ్మాయిల కోసం కేటాయించిన పరీక్ష హాలు కాగా బై మిస్టేక్ శంకర్ కు అదే హాల్ లో వచ్చింది. దీంతో ఇది ముమ్మాటికి అధికారుల తప్పేనని శంకర్ బంధువులు మండిపడుతున్నారు.

కాగా, రాష్ట్రంలోని నలందతోపాటు నవడా, ముంగెర్, బాంకా, దర్భాంగ, సమస్తిపూర్, అరారియా సహా పలు జిల్లాల్లో మాస్ కాపీయింగ్ జరిగినట్టు సోషల్ మీడియా పలు కథనాలొచ్చాయి. కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్లలో విద్యార్థులు యథేచ్ఛగా కాపీయింగ్‌కు పాల్పడుతున్న సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అదలా ఉండగానే అదే రోజు ఇలా ఓ విద్యార్థి స్పృహతప్పి పడిపోవడంతో బీహార్ ఇంటర్ పరీక్షలు దేశవ్యాప్తంగా తెలిసిపోయింది.