Congress Party: మీ నాన్నని చంపేస్తాం.. చెరుకు సుధాకర్ కుమారుడితో ఎంపీ కోమటిరెడ్డి ఫోన్ కాల్ రికార్డ్ వైరల్!

Congress Party: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకపక్క పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతున్నా.. పార్టీ నేతల మధ్య సఖ్యత మాత్రం కుదరడం లేదు. ఒకవైపు పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రతో పార్టీకి అంతోఇంతో ఊపు తేవాలని ప్రయత్నాలు జరుగుతున్నా.. పార్టీ మిగతా సీనియర్లు ఎవరూ ఆ వైపు చూడడం లేదు. పైగా ఇప్పుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియోగా ఒక ఆడియో వైరల్ అవుతుంది.
ఇది నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కుమారుడితో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్ గా తెలుస్తుంది. నల్గొండ జిల్లాకు చెందిన చెరుకు సుధాకర్ అనే నేత కొన్నాళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయనకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారనే టాక్ ఉంది. ఈయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఇతర పార్టీల నేతలపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. అయితే.. చెరుకు చేరికను మొదట్నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
అప్పట్లో చెరుకు పార్టీలో చేరిన సమయంలో కోమటిరెడ్డి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. గతంలో తనను ఓడిస్తానని సవాల్ చేసిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని.. రేవంత్ రెడ్డి పెద్ద తప్పు చేశారని మండిపడ్డారు. కాగా, ఇప్పుడు కోమటిరెడ్డి చెరుకు సుధాకర్ ను చంపేస్తామని బెదిరించినట్లుగా ఫోన్ కాల్ రికార్డ్ ఒకటి వైరల్ అవుతుంది. చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ తో ఎంపీ మాట్లాడినట్లుగా ఉన్న ఆ ఆడియోలో.. తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని.. చెరుకు సుధాకర్ ను చంపుతామని వంద వెహికిల్స్ తిరుగుతున్నాయని చెప్పారు.
ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో లక్షల మందికి సాయం చేశానని.. తనను ఏమైనా అంటే వారంతా ఊరుకుంటారా? చంపేస్తారు అంటూ హెచ్చరించారు. వారం రోజుల్లోనే చంపేస్తారని.. పరుష పదజాలాన్ని కూడా వాడారు. నిన్ను కూడా లేపేస్తారు.. నీ హస్పిటల్ ఉండదు.. అంటూ సుహాస్ కి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు ఆ ఆడియోలో ఉంది. ఇప్పుడు ఈ ఆడియో తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఆసక్తికరంగా మారింది.