Psycho: పట్టపగలు సైకో వీరంగం.. చేతిలో ఓ రాడ్ పట్టుకుని కనిపిస్తే దాడి చేస్తూ హడల్!

Psycho: పట్టపగలు ఓ సైకో వీరంగం సృష్టించాడు. చేతిలో ఓ రాడ్డు పట్టుకొని కనిపించిన వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ ఎదురొచ్చిన వారిపై దాడికి ప్రయత్నిస్తూ హడలెత్తించాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశాడు. ఏపీలోని కర్నూలు జిల్లాలో ఇది జరిగింది. సైకో వీరంగానికి సంబంధించి ఎవరో వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్ స్టేషన్ ముందు ఓ సైకో హల్ చల్ చేశాడు. చేతిలో రాడ్ పట్టుకుని రోడ్డుపై ఉన్న రెండు కార్లు, బస్సు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశాడు. ఇక ఇతడిని చూసిన స్థానిక ప్రజలు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. అంతేకాకుండా ఆ సైకో నేరుగా పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి అందులో ఉన్న ఫర్నిచర్ ను అంతా నాశనం చేశాడు.
దీంతో పోలీసులు అతడిని ఆపేందుకు ప్రయత్నించినా, పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా దొరకలేదు. ఇక కొద్దిసేపు ఆ సైకో పోలీసులకు చుక్కలు చూపించాడు. ఇదంతా గమనించిన కొందరు స్థానికులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొత్తానికి ఎలాగోలా ఆ సైకోను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని మైసూరుకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. కాగా, హల్ చల్ చేసిన ఈ సైకో దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి.