Bandi Sai Bageerath: బండి సంజయ్ తనయుడిపై కేసు నమోదు.. ఎందుకంటే?

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 08:32 PM

Bandi Sai Bageerath: బండి సంజయ్ తనయుడిపై కేసు నమోదు.. ఎందుకంటే?

Bandi Sai Bageerath: తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదయింది. బండి సాయి భగీరథ్‌ ఓ విద్యార్థిని చితకబాదినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలవగా దుండిగల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న బండి సంజయ్‌ కొడుకు సాయి భగీరథ్‌ ర్యాగింగ్‌ పేరుతో విద్యార్థిని తీవ్రంగా కొట్టి గాయపడిచాడని వార్తలొస్తున్నాయి.

ఈ మేరకు ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ప్రకారం.. బండి సాయి భగీరథ్ నానా భూతులు తిడుతూ ఓ విద్యార్థిపై దాడి చేశాడు. ఇందులో సాయి భగీరథ్ తో పాటు అతని స్నేహితులు కలిసి చితకబాదుతూ, ప్రాంతం పేరుతో దూషించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడం వీడియోలో కనిపిస్తున్నది. పైగా మంత్రికి చెప్పినా నన్నేం పీకలేరంటు రంకెలు వేయడం వీడియోలో ఉంది.

బండి సంజయ్‌ తనయుడు గతంలోనూ ఢిల్లీలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో చదువుతూ ఇలాగే గొడవలకు దిగడంతో సంస్థ నుంచి యాజమాన్యం గెంటివేసినట్లు సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది. తాజాగా నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలోని విద్యార్థిని చావబాదినట్లు మరో వీడియో ప్రచారంలోకి వచ్చింది. దీంతో.. ప్రతిపక్ష నేత బండి సంజయ్ కొడుకు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిపై దాడి చేయడంతో పాటు చంపుతామని బెదిరించిన బండి సాయి భగీరథ్‌పై దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్యార్థిపై బండి సంజయ్ తనయుడు సాయి బగీరథ్ తో పాటు స్నేహితులు దాడి చేసిన ఘటనలో మహీంద్రా యూనివర్సిటీ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే.. ఈ వీడియో నిజమా కదా అన్నది ఇంకా బీజేపీ వర్గాలు ధృవీకరించలేదు. బీజేపీ శ్రేణులు లేదా బండి కుటుంబం ఈ ఘటనపై స్పందిస్తే కానీ నిజానిజాలు తెలియదు.