Malakpet Hospital: ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి.. ఆపరేషన్ థియేటర్ సీజ్.. ఏం తేల్చారంటే?

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 08:54 PM

Malakpet Hospital: ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి.. ఆపరేషన్ థియేటర్ సీజ్.. ఏం తేల్చారంటే?

Malakpet Hospital: నగరంలోని మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. నవమాసాలు మోసి తీరా ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చేసరికి నిర్లక్ష్యం వారిని కాటేసింది. మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇద్దరు బాలింతలు మృతి చెందారు. మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో సిజేరియన్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యం విషమించడంతో నాగర్‌కర్నూల్ జిల్లా వెల్లండ మండలం చెదుమపల్లికి చెందిన సిరివెన్నెల(23), హైదరాబాద్ పూసలబస్తీకి చెందిన శివాని(24) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు 12వ తేదీన, మరొకరు 13న మృతి చెందారు.

ఈ ఇద్దరు మృతి చెందడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలింతల మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 13న ఆసుపత్రి ఎదుట మృతుల కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సంఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కూడా స్పందించారు. ఈ ఘటనపై గైనకాలజిస్ట్ గా తనకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయంటూ అందరినీ షాక్ కు గురి చేశారు. రాష్ట్రంలోని వైద్య రంగంలో వసతులను మరింత మెరుగు పరచాల్సిన అవసరం చాలా ఉందంటూ చెప్పారు. రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మరింతగా మెరుగు పరచాలని గవర్నర్ తమిళిసై చెప్పారు.

ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటన అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ నిర్లక్షానికి పరాకాష్ట అని విమర్శించారు. ప్రభుత్వ వైఖరి వల్లనే ప్రైవేట్ వైద్యం ఇక్కడ అభివృద్ధి చెందుతోందని విమర్శించారు. కాగా, ఈ ఇద్దరు బాలింతల మృతికి ఇన్ ఫెక్షన్ కారణమని వైద్యశాఖ ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను వైద్య శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి అందింది. ఈ క్రమంలో ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లు మూసివేశారు.

మరోవైపు మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో ఈ ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న 18 మందిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు బాలింతలకు కిడ్నీలకు ఇన్ ఫెక్షన్ సోకింది. వీరికి డయాలసిస్ నిర్వహిస్తున్నారు. నిమ్స్ లో చికిత్స పొందిన వారిలో 9 మందిని డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వారు కూడా కోలుకుంటున్నారని వైద్య ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నారు.