Hyderabad: కుక్క అరుపుకి భయపడి 3వ అంతస్తు నుండి దూకేసిన డెలివరీ బాయ్

Kaburulu

Kaburulu Desk

January 13, 2023 | 07:39 PM

Hyderabad: కుక్క అరుపుకి భయపడి 3వ అంతస్తు నుండి దూకేసిన డెలివరీ బాయ్

Hyderabad: రోజంతా బైకు మీద డెలివరీలు చేస్తే కానీ.. పూట గడవదు. సిటీలో డెలివరీ అంటే రోడ్ల మీద ట్రాఫిక్ సమస్యలు.. అడ్రస్ సరిగా అర్ధం కాని గందరగోళం.. దీనికి తోడు సరైన సమయానికి డెలివరీ ఇవ్వలేకపోతే అటు సంస్థ నుండి ఇటు యజమాని నుండి ఇబ్బందులు తప్పవు. అందుకే ఉరుకుల పరుగుల మీద డెలివరీ బాయ్స్ పరుగులు పెడుతుంటారు. ఇలా పరుగులు పెట్టే సమయంలో కొందరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.

హైదరాబాద్ లో అలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. ఆతృతగా డెలివరీ ఇచ్చేందుకు ఇంటి గుమ్మం వద్దకు వెళ్లిన డెలివరీ బాయ్.. డోర్ తీయగానే కనిపించిన కుక్క అరుపులకి బయటపడి మూడవ అంతస్థు నుండి దూకేశాడు. దీంతో ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. యూసుఫ్ గూడలోని శ్రీరాం నగర్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్(23) మూడేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి బంజారాహిల్స్
రోడ్ నంబరు 6లోని లుంబిని రాక్ క్యాసిల్ అపార్ట్మెంట్ మూడో అంతస్థులో ఆర్డర్ డెలివరి ఇచ్చేందుకు వెళ్లాడు.

ఇంటి కాలింగ్ బెల్ కొట్టగా యజమాని శోభన తలుపు తీసింది. అయితే, ఇంట్లో ఉన్న జర్మన్ షపర్డ్ శునకం మొరుగుతూ రావడంతో భయపడిన రిజ్వాన్ మూడో అంతస్తు నుంచి కిందకి దూకాడు. కింద సిమెంట్ ఫ్లోర్ కావడంతో రిజ్వాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కిందకి వెళ్లిన శోభన ఇరుగు పొరుగు సాయంతో అంబులెన్స్ లో అతన్ని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పినా రిజ్వాన్ కోలుకునేందుకు చాలా టైమ్ పడుతుందట.

కాగా, ఇంటి యజమాని నిర్లక్ష్యం వల్లే రిజ్వాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాడని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని బాధితుడి సోదరుడు మహ్మద్ ఖాజా గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.