Bandi Sanjay: విద్యార్థిపై దాడి కేసు.. బండి సంజయ్‌ కొడుకు భగీరథ్‌కు పోలీస్ నోటీసులు

Kaburulu

Kaburulu Desk

January 28, 2023 | 08:58 PM

Bandi Sanjay: విద్యార్థిపై దాడి కేసు.. బండి సంజయ్‌ కొడుకు భగీరథ్‌కు పోలీస్ నోటీసులు

Bandi Sanjay: బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ కు పోలీసులు నోటీసులిచ్చారు. హైదరాబాద్‌లోని మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న బండి సాయి భగీరథ్ విద్యార్థిపై దాడి చేశాడన్న కేసులో పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ దుండిగల్ పోలీసులు ఇప్పటికే బండి భగీరథపై CR. NO : 50/2023 u/s 341, 323, 504, 506 r/w 34 ఐపీసీ కింద కేసు నమోదు చేయగా.. ప్రస్తుతం 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు.

బండి సాయి భగీరథ్‌ ఓ విద్యార్థిని చితకబాదినట్లుగా కొద్దిరోజుల క్రితం ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలవగా దుండిగల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న బండి సంజయ్‌ కొడుకు సాయి భగీరథ్‌ ర్యాగింగ్‌ పేరుతో విద్యార్థిని తీవ్రంగా కొట్టి గాయపడిచాడని దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ వీడియో ప్రకారం.. బండి సాయి భగీరథ్ నానా భూతులు తిడుతూ ఓ విద్యార్థిపై దాడి చేశాడు. ఇందులో సాయి భగీరథ్ తో పాటు అతని స్నేహితులు ఓ విద్యార్థిని చితకబాదుతూ, ప్రాంతం పేరుతో దూషించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడం కూడా వీడియోలో కనిపిస్తున్నది. పైగా మంత్రికి చెప్పినా నన్నేం పీకలేరంటు రంకెలు వేయడం వీడియోలో ఉంది.

దీనిపై అప్పుడే పెద్ద రాద్ధాంతం జరిగింది. ఈ వీడియోలో బండి భగీరథ్ చేత దెబ్బలు తిన్న విద్యార్థి కూడా ఈ విషయంపై స్పందించాడు. తనను కొట్టింది నిజమే కానీ.. దానికి కారణం ర్యాగింగ్ కాదని.. చాలా పెద్ద స్టోరీ ఉందని చెప్పుకొచ్చాడు. తప్పు మాత్రం తనదేనని.. ఆ ఘటన తర్వాతా ఇద్దరం కాంప్రమైజ్ అయ్యామని.. అనవసరంగా వీడియోను వైరల్ చేస్తున్నారంటూ వివరించాడు.

తన కుమారుడు భగీరథ్ వ్యవహారంపై బండి సంజయ్ కూడా అప్పుడే స్పందించారు. పిల్లలన్నాక కొట్టుకుంటారు తిట్టుకుంటారు.. అలాంటి వాటిని కేసీఆర్ ఇంత పెద్ద రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదన్నారు. ఏదైనా ఉంటే తనతో ఢీ కొనాలి తప్ప పిలల్ని రాజకీయ గొడవల్లోకి లాగడం సిగ్గుచేటన్నారు. అయితే.. ఇప్పుడు ఆ వ్యవహారంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు.