Summer Bumper Lottery: సినీ నటి ఇంట్లో పని మనిషికి రూ.10 కోట్ల లాటరీ.. రాత్రికి రాత్రే కోటేశ్వరుడయ్యాడు!

Kaburulu

Kaburulu Desk

March 21, 2023 | 11:18 AM

Summer Bumper Lottery: సినీ నటి ఇంట్లో పని మనిషికి రూ.10 కోట్ల లాటరీ.. రాత్రికి రాత్రే కోటేశ్వరుడయ్యాడు!

Summer Bumper Lottery: అదృష్టం ఉండాలే గానీ.. ఎక్కడ కూర్చున్నా మన చెంతకి వచ్చి చేరుతుంది. దీనికి నిదర్శనం ఇది. ఒకతను 1995లో పని వెతుక్కుంటూ అస్సాం నుండి కేరళకి వలస వచ్చాడు. అప్పటి నుండి అక్కడా ఇక్కడా ఏదొక పనిచేసుకుంటూ వస్తున్న అతను ప్రస్తుతం ఓ సినీ నటి ఇంట్లో పనితో పాటు ఆమెకి అసిస్టెంట్ గా ఉంటున్నాడు. అయితే, అతను లాటరీ పుణ్యమా అని రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడు.

వివరాలలోకి వెళ్తే.. అసోంకు చెందిన ఆల్బర్ట్ టిగా అనే వ్యక్తి కేరళ కొచ్చిలో నివసిస్తున్నాడు. ఇతడు కొన్ని సంవత్సరాలుగా రజిని చాందీ అనే సినీ నటి ఇంట్లో పనిమనిషిగా చేస్తున్నాడు. తరచూ లాటరీ టికెట్లు కొనే అలవాటున్న ఆల్బర్ట్.. అలాగే మరో టికెట్ (ఎస్ఈ 222282) కొన్నాడు. అయితే, ఈసారి అతడిని అదృష్టం వరించింది. ఏకంగా రూ. 10 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. కేరళ లాటరీ డిపార్డ్మెంట్ ‘సమ్మర్ బంపర్ బీఆర్ 90 లాటరీ’ ఫలితాలను విడుదల చేసింది.

రాష్ట్ర లాటరీ విభాగం ఆదివారం సమ్మర్ బంపర్ BR 90 ఫలితాన్ని ప్రకటించింది. తిరువనంతపురంలోని గోర్కీ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో డ్రా జరిగింది. దీంట్లో రూ. 10 కోట్ల లాటరీ గెలుచుకున్న అల్బర్ట్.. క్లైం ప్రాసెస్ పూర్తి చేసుకుని టికెట్ను కొచ్చిలోని ఓ బ్యాంకులో సమర్పించాడు. ఈ లాటరీ టికెట్ను ఎర్నాకులం జిల్లాకు చెందిన లాటరీ ఏజెంట్ ఎమ్డీ జాన్ విక్రయించాడు. ఇందులో మరో విశేషం ఏమిటంటే.. రెండో ప్రైజ్ గెలిచిన లాటరీ టికెట్ (ఎస్బీ 152330)ను కూడా జాన్ ఏజెన్సీయే విక్రయించింది. ఈ రెండో బహుమతి విజేతకు రూ.50 లక్షలు దక్కాయి.

ఎర్నాకులంలో విక్రయించిన టిక్కెట్‌లకు మొదటి బహుమతి, రెండవ బహుమతి లభించడం విశేషం. ఇక ఈ లాటరీలో మూడో బహుమతి ఐదు లక్షలు. నాల్గవ బహుమతి విజేతకు లక్ష రూపాయలు, ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు, ఆరో బహుమతి రూ.2,000. ఏడో బహుమతి రూ.1,000. ఎనిమిదో బహుమతికి రూ.500 కూడా లభిస్తుంది. టికెట్ ధర 250 రూపాయలు.