LPG Cylinder Price Hike: మళ్ళీ బాదేశారు బాబోయ్.. వంట గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంపు!

LPG Cylinder Price Hike: దేశంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మరో షాక్ తగిలింది. దేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలు మరింత పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో సారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశాయి. అటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు, ఇటు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు రెండూ కూడా పెరిగాయి. సాధారణంగా గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెరిగితే.. వాణిజ్య సిలిండర్ ధరపై రూ. 350.50 పెంచినట్టు పెట్రోలియం సంస్థలు ప్రకటించాయి.
పెరిగిన ధరలు కూడా నేటి నుంచే అమల్లోకి వచ్చేశాయి. తాజా సవరణతో దేశ రాజధాని ఢిల్లీలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,103కి చేరగా.. హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నిన్నటి వరకు రూ. 1,105 ఉండగా తాజా పెంపుతో అది రూ. 1,155కు చేరుకుంది. వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2,119.50కి చేరుకుంది. వాణిజ్య సిలిండర్ ధర పెరగడం ఈ ఏడాది ఇది రెండోసారి. జనవరి 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ. 25 పెరిగింది.
స్థానిక పన్నుల కారణంగా.. ఎల్పీజీ సిలిండర్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తుంటారు. దేశంలోని ప్రతి ఇంటికి ఏడాది చొప్పున 12 సిలిండర్లు (14.2కేజీల) సబ్సిడీ రేట్లతో అందుతాయి. వీటికి అదనంగా తీసుకోవాలంటే.. మార్కెట్లో ఉన్న ధరకు తగ్గట్టు కొనాల్సిందే.