Special Marriage: తన భార్యతో లేచిపోయిన వ్యక్తి భార్యను పెళ్లాడి ప్రతీకారం తీర్చుకున్న బాధితుడు!

Kaburulu

Kaburulu Desk

February 28, 2023 | 11:35 AM

Special Marriage: తన భార్యతో లేచిపోయిన వ్యక్తి భార్యను పెళ్లాడి ప్రతీకారం తీర్చుకున్న బాధితుడు!

Special Marriage: అప్పుడప్పుడు మనం కొన్ని వార్తలు చూస్తే.. అర్రే అదెలా సాధ్యమైందబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి ఘటనలు సినిమాలలోనో, పుస్తకాలలోనో చదవడమే తప్ప.. నిజ జీవితంలో ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ, ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లు.. నో ఛాన్స్ అన్నవి కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకొనే పెళ్లి కూడా అలాంటిదే మరి.

ఓ వ్యక్తి తన భార్యతో లేచిపోగా.. బాధితుడు తన భార్యతో వెళ్లిపోయిన వ్యక్తి భార్యతో పరిచయం పెంచుకొని.. పెళ్లి ప్రపోజల్ తెచ్చి చివరికి ఎలాగోలా పెళ్లి చేసుకున్నాడు. పరారైన జంట పెళ్ళికి ముందే ప్రేమించుకోగా.. పెళ్లి తర్వాత కూడా అనుబంధాన్ని కొనసాగించారు. చివరికి తమ జీవిత భాగస్వాములను వదిలేసి పరారయ్యారు. దీంతో అటు ప్రియుడి భార్య.. ఇటు ప్రియురాలి భర్త ఒంటరి కాగా.. వారిద్దరూ పెళ్లి చేసుకొని అవాక్కయ్యేలా చేశారు.

బీహార్‌లోని ఖగారియాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఛౌథామ్ బ్లాక్‌లోని హార్డియా గ్రామానికి చెందిన ముకేశ్ అనే వ్యక్తి నీరజ్ భార్య రూబీతో పరారయ్యాడు. వీరిద్దరూ పెళ్లికి ముందే ప్రేమించుకోగా.. వివాహం తర్వాత కూడా పరిచయం కొనసాగింది. మరోవైపు, ముకేశ్‌కు కూడా వివాహం జరిగినా వీరి మధ్య బంధం మాత్రం అలాగే ఉంది. ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో ముకేశ్ తన ప్రియురాలు అయిన రూబీతో పరారై వివాహం చేసుకొని.. తన ముగ్గురు పిల్లలు, రూబీతో కలిసి గ్రామాన్ని విడిచి మరో చోట కాపురం పెట్టారు.

తన భార్య రూబీ ముకేశ్‌తో వెళ్లిపోవడంపై నీరజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా గ్రామ పెద్దలు కూడా పంచాయితీ పెట్టి ముకేశ్‌తో మాట్లాడినా ఫలితం లేదు. దీంతో ముకేశ్‌పై పగ పెంచుకున్న నీరజ్.. ముకేశ్ భార్యతో పరిచయం పెంచుకుని పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఈ క్రమంలో ఈనెల 18న స్థానిక ఆలయంలో ఆమెను వివాహం చేసుకోవడంతో అందరూ అవాక్కయ్యారు. ముకేశ్ రోజు కూలీ కాగా, నీరజ్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. మొత్తంగా అటు ఆ జంట.. ఇటు ఈ జంట ఒక్కటయ్యారు.