Interesting Love Story: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. ఒక్కటైన ఒంగోలు అబ్బాయి, అమెరికా అమ్మాయి!

Kaburulu

Kaburulu Desk

February 25, 2023 | 05:04 PM

Interesting Love Story: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. ఒక్కటైన ఒంగోలు అబ్బాయి, అమెరికా అమ్మాయి!

Interesting Love Story: ప్రేమకి కులమతాలు ఉండవు.. పేద, ధనిక తేడాలుండవని మన కవులు ఎన్నో చెప్తుంటారు. ఇప్పుడు మన సమాజంలో వచ్చిన మార్పులు చూస్తుంటే ప్రేమకి ఖండాంతరాలు కూడా ఉండవని చెప్పుకోవచ్చు. ఎవరు అవునన్నా.. కాదన్నా ప్రేమ అనేది పవిత్ర బంధం. ప్రేమ పేరుతో కొన్నిచోట్ల తప్పటడుగులు పడుతున్నా అవేమీ ప్రేమకు మరక కానేకాదు. ఎల్లలు దాటి.. ఖండాలు దాటి ప్రేమ కోసం వచ్చిన యువతి.. దేశం కాని దేశంలో యువతిని ప్రేమించి.. స్వదేశంలో అందరినీ ఒప్పించి ఆ యువతిని పెళ్లాడిన యువకుడిదే ఈ కథ.

తాజాగా ఏపీలోని ఒంగోలులో ఒక ఖండాంతర వివాహం జరిగింది. ఒంగోలులోని ప్రముఖ హోటల్‌ అధినేత, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎదుబాటి కొండయ్య నాయుడు-గుణవతి దంపతుల ఏకైక కుమారుడు సాయికిరణ్‌ ఎనిమిదేళ్ల క్రితం ఎంఎస్ కోసం అమెరికా వెళ్లగా.. చదువు అనంతరం ఒహియో స్టేట్ లో సాఫ్ట్ వేర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అక్కడే మరో కంపెనీలో పనిచేస్తున్న అమెరికా వాసి కైలిన్ తో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది.

సాయి కిరణ్-కైలిన్ ప్రేమలో ఉన్నారని కైలిన్ తన తల్లిదండ్రులైన బి.కర్ట్‌, అన్నెకు చెప్పగా.. ఇటు సాయి కిరణ్ కూడా ఆయన తల్లిదండ్రులకు చెప్పారు. రెండు కుటుంబాలు ఈ పెళ్లికి ఒప్పుకోవడంతో ముందుగా అమెరికాలో కైలిన్ మత సంప్రదాయం ప్రకారం ఒక్కటై ఇండియాకి వచ్చారు. ఇక్కడ యువకుడి స్వస్థలమైన ఒంగోలులో హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా వివాహం జరిపించారు.

ఒంగోలు నగరంలోని గోపాల స్వామి కళ్యాణ మండపంలో అంగరంగా వైభవంగా జరిగిన ఈ వేడుకకు.. ప్రజా ప్రతినిధులు, నగరంలోని ప్రముఖులు హాజరై వధూవరూలను ఆశ్వీరదించారు. ఒంగోలులో జరిగిన పెళ్లి వేడుకలో కైలిన్ పేరును కళ్యాణిగా మార్చి వివాహాం జరిపించడం విశేషం. కాగా, ఈ పెళ్లిని చూసిన వారంతా ప్రేమలు ఎల్లలు దాటి హద్దులు చెరిపేస్తున్నాయని అభినందిస్తున్నారు.