Balakrishnan: 24 ఏళ్లుగా ఇతనికి కొబ్బరి, కొబ్బరి నీరే ఆహరం.. ఆశ్చర్యపోతున్న వైద్యులు!

Kaburulu

Kaburulu Desk

February 20, 2023 | 03:25 PM

Balakrishnan: 24 ఏళ్లుగా ఇతనికి కొబ్బరి, కొబ్బరి నీరే ఆహరం.. ఆశ్చర్యపోతున్న వైద్యులు!

Balakrishnan: గత 24 ఏళ్లుగా ఇతను కేవలం కొబ్బరి తింటూ, కొబ్బరి నీరు మాత్రమే తాగుతూ బ్రతుకుతున్నాడంటే మీరు నమ్ముతారా? ఇది నిజం కనుక నమ్మాలి మరి. బాలకృష్ణన్ అనే ఓ వ్యక్తి 24 ఏళ్లుగా కొబ్బరినీళ్లు, కొబ్బరి మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. ఆయన ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఇప్పుడు వయసుపై బడినప్పటికీ అతని ముఖంలో అదే మెరుపు ఉంది. ఆరోగ్యకరమైన శరీరంతో చాలా సంతోషంగా ఉన్నాడు కూడా.

ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ షహనాజ్ ట్రెజరీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కొబ్బరి నీరు, కొబ్బరితో జీవించే బాలకృష్ణన్ కథను షేర్ చేశారు. 24 ఏళ్లుగా ఓ వ్యక్తి ఎలాంటి భోజనం తినకుండా.. కేవలం కొబ్బరి నీళ్లు తాగుతూ, కొబ్బరిని తింటున్నాడని తెలిసి షాక్ అయ్యానని షహనాజ్ ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. కొబ్బరి తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను బాలకృష్ణన్ వివరించే వీడియోను కూడా అందరితో పంచుకున్నారు.

ఆ వీడియోలో బాలకృష్ణన్‌ను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు షహనాజ్. కొబ్బరిని మాత్రమే ఆహారంగా తీసుకోవాలనే నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారని షహనాజ్ బాలకృష్ణన్ ను ప్రశ్నించారు. ఈ క్వశ్చన్‌కు బాలకృష్ణన్ స్పందిస్తూ.. తన ఆరోగ్యం విషయంలో తలెత్తిన ఓ సమస్య వల్లే ఇలా చేయాల్సి వచ్చిందన్నాడు. గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ/గెర్డ్) వల్ల ఆహారం మానేశానని అతను చెప్పాడు.

జెర్డ్ సమస్య ఉండడంతో ఆహారం తీసుకుంటే ఎన్నో సమస్యలు ఎదుర్కొనే వాడినని.. ఆ వ్యాధి వల్ల నా శక్తినంతా కోల్పోయా. ఆ తర్వాత అకస్మాత్తుగా కొబ్బరినీళ్లు మాత్రమే తాగాలని నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి కొబ్బరిని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నానని బాలకృష్ణన్ చెప్పుకొచ్చారు. అయితే, కేవలం కొబ్బరి తీసుకుని ఇన్నేళ్లు ఎలా బతికాడని అందరూ షాక్ అవుతున్నారు. కేవలం కొబ్బరి తింటూ అధిక కాలం జీవించి ఉండడం అందరికీ సాధ్యపడదంటున్న వైద్యులు.. కేవలం కొబ్బరి తీసుకుంటే అధిక పొటాషియంతో హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు పెరుగుతుందంటున్నారు. అయితే, కొబ్బరిలో క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం మినరల్స్ తో తనకి శక్తి సరిపోతుందంటున్నారు బాలకృష్ణన్.