Naveen Murder Case: స్నేహితుడిని ముక్కలుగా నరికి చంపిన కేసు.. హరి ప్రియురాలుకు బెయిల్ మంజూరు!

Naveen Murder Case: సంచలనం సృష్టించిన హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో హరి ప్రియురాలు నిహారికకు బెయిల్ దొరికింది. ఈ కేసులో నిందితుడు హరిహర కృష్ణతో పాటు ప్రియురాలు నిహారికను, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియురాలు నిహారికారెడ్డిని ఏ3గా, స్నేహితుడు హసన్‌ను ఏ2గా పోలీసులు చేర్చారు. నవీన్ హత్యకు నిహారికాతో ప్రేమ వ్యవహారమే కారణం కాగా నిహారికాకి తెలిసే అన్నీ జరిగాయని ఎల్‌బీ నగర్ డీసీపీ సాయిశ్రీ చెప్పారు.
నవీన్ హత్య గురించి నిహారికకు తెలిసినా పోలీసులకు చెప్పలేదు. స్నేహితుడు హసన్‌కు కూడా హత్య విషయం తెలుసు. నిహారికా, హాసన్ హత్య తర్వాత నవీన్ మృతదేహం ఉన్న ప్రాంతానికి ఈ ఇద్దరూ వెళ్లారని.. అందుకే నిహారికతో పాటు హసన్‌ను రిమాండ్‌కు తరలించామని అప్పుడు డీసీపీ వెల్లడించారు. అంతేకాదు, హత్య జరిగిన తర్వాత హరిహరకు నిహారిక రూ.1500 ట్రాన్స్‌ఫర్ చేసిందని.. నవీన్‌ను హత్య చేసిన తర్వాత ఘటనాస్థలికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారని కూడా డీసీపీ వెల్లడించారు. పైగా ఫోన్ లో సమాచారాన్ని కూడా తొలగించారు. దీంతో పోలీసులు హాసన్, నిహారికలను అరెస్ట్ చేశారు.
కాగా, ఈ కేసులో జంట నగరాలలో పెను సంచలనంగా మారింది. హత్య చేసిన తీరు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, హత్యకు వేసిన పథకం ప్రజలపై ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా హరిహరకృష్ణ ఉండగా, మరో నిందితురాలిగా అతని ప్రియురాలు నిహారిక ఉంది. తాజాగా నిహారికకు బెయిల్ వచ్చింది. నిహారికా రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదల కానుంది.