Delhi Police: రాహుల్ గాంధీ నివాసాన్ని ముట్టడించిన పోలీసులు.. ఏం జరగబోతుందనే ఉత్కంఠ..!

Kaburulu

Kaburulu Desk

March 19, 2023 | 04:49 PM

Delhi Police: రాహుల్ గాంధీ నివాసాన్ని ముట్టడించిన పోలీసులు.. ఏం జరగబోతుందనే ఉత్కంఠ..!

Delhi Police: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నివాసాన్ని ఢిల్లీ పోలీసులు భారీగా ముట్టడించారు. పోలీసుల ముట్టడి వ్యవహారం తెలియడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు కూడా రాహుల్ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. కానీ కొద్దిసేపటికి పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ హైడ్రామా నడించింది.

భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మహిళల లైంగిక వేధింపులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు ఆయనకు మార్చి 16న నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా రాహుల్ గాంధీ నివాసానికి పోలీసు అధికారులు చేరుకున్నారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా నోటీసులు పంపిన పోలీసులు.. ఆదివారం ఉదయం రాహుల్ గాంధీ నివాసానికి చేరుకున్నారు.

రాహుల్ నివాసానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్న విషయం తెలియగానే.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఎంపీలు అభిషేక్ మను సింఘ్వీ, జైరాం రమేశ్ తదితరులు కూడా వచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుని నిరసనలు చేశారు. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కనిపించింది. అయితే తర్వాత పోలీసులు వెళ్లిపోయారు. దీంతో ఉద్రిక్తత చల్లబడింది.

భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. ‘మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురువుతున్నట్టు నేను వింటున్నాను’ అన్నారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చామని, లైంగిక వేధింపులకు గురైన మహిళల వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నామని.. వివరాలు ఇవ్వమని ఈరోజు ఆయన నివాసానికి వచ్చామని పేర్కొన్నారు.

ఈ పోలీసు బృందానికి ఢిల్లీ పోలీసు శాంతిభద్రతల విభాగం ప్రత్యేక పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా నాయకత్వం వహించగా.. రాహుల్ గాంధీ నివాసం బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భారత్ జోడో యాత్రలో తనను పలువురు మహిళలు కలిశారని, తమపై అత్యాచారాలు జరిగాయని చెప్పారని రాహుల్ గాంధీ జనవరి 30న కశ్మీర్ లో జరిగిన సభలో చెప్పారు. ఆ బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు.. వారి వివరాలను మాకు ఇవ్వాలని ఆయనను కోరేందుకు వచ్చామని చెప్పారు.

ముందుగా రాహుల్ నుంచి సమాచారం తీసుకుంటామని చెప్పిన పోలీసులు.. కొన్ని గంటల తర్వాత అలాంటిదేమీ లేకుండానే వెళ్లిపోయారు. ఈరోజు రాహుల్‌ను ప్రశ్నించలేమని, తర్వాత వాంగ్మూలం నమోదు చేస్తామని తెలిపారు. త్వరలో సమాచారం ఇస్తానని రాహుల్ చెప్పారని.. మాకు సమాచారం అందిన వెంటనే చర్యలు ప్రారంభిస్తామని స్పెషల్ సీపీ సాగర్ ప్రీత్ హుడా తెలిపారు.