Bandi Sanjay: ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ!

Kaburulu

Kaburulu Desk

March 19, 2023 | 04:36 PM

Bandi Sanjay: ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ!

Bandi Sanjay: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో ఆదేశించారు. కవితపై వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

దానం నాగేందర్ ఫిర్యాదు ఆధారంగా సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఒక్క పంజాగుట్ట మాత్రమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలుచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, పంజాగుట్ట పోలీసులు మాత్రం విచారణకు పిలిచారు.

ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంజయ్‌ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవిత దోషిగా తేలితే అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా’ అని వాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తర్వాత బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. బండి సంజయ్‌ మహిళలకు క్షమాపణలు చెప్పాలని మంత్రులు డిమాండ్‌ చేశారు.

ఆయనను బీజేపీ నుంచి బహిష్కరించాలని బీఆర్ఎస్ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ మహిళ అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారని బీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇప్పటికే ఆయనపై చర్యలు చేపట్టాలని మహిళా కమీషన్ కు సైతం ఫిర్యాదు చేశారు. శనివారం బండి సంజయ్ కమిషన్ ముందు హాజరై లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తెలంగాణ సామెతలను ఉపయోగించానని చెప్పారు. దీంతో ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని మహిళా కమిషన్ చెప్పినట్లు సమాచారం.