Power consumption: మండిపోతున్న ఎండలు.. కరెంట్ వినియోగంలో చరిత్ర తిరగరాస్తున్న తెలంగాణ!

Kaburulu

Kaburulu Desk

February 28, 2023 | 08:07 PM

Power consumption: మండిపోతున్న ఎండలు.. కరెంట్ వినియోగంలో చరిత్ర తిరగరాస్తున్న తెలంగాణ!

Power consumption: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు పోతున్నాయి. మండే ఎండలతో ప్రజలు కూడా భారీ స్థాయిలో విద్యుత్ వినియోగిస్తున్నారు. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మంగళవారం డిమాండ్ ఏర్పడింది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా 14,794 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది ఇదేరోజున గరిష్టంగా 12,966 మెగావాట్ల వినియోగం నమోదవగా.. నేడు 14,794 మెగావాట్ల వినియోగం జరిగింది.

గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా ఈసారి డిసెంబర్ నెలలోనే గత సంవత్సరం రికార్డ్ ను అధిగమించి 14501 మెగా వాట్ల విద్యుత్ నమోదు అయింది. తాజాగా 14750 మెగా వాట్ల ఫీక్ విద్యుత్ వినియోగం నమోదయింది. ఈ సంవత్సరం వేసవి కాలంలో 16 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. డిమాండ్ ఎంత వచ్చిన 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తాం అంటున్నారు ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు.

ఇక, ఎండలు మరింత పెరిగేకొద్దీ రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని ట్రాన్స్-కో అధికారులు అంచనా వేస్తున్నారు. సాగు విస్తీర్ణం పెరగడం, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయానికే 37 శాతం వినియోగిస్తున్న రాష్ట్రంగా నిలిచిందని అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా పంటలకు నీటి పంపిణీ పెరిగిందని, ఉద్యానవన పంటలకు కూడా నీటి వినియోగం పెరిగిందన్నారు.

దేశంలో వ్యవసాయ రంగంకు అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. బోరుబావుల ఆధారంగా సేద్యం చేస్తున్న కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిపోయిందన్నారు. డిమాండ్ కు తగినట్లు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.