Union Budget: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్ధిక మంత్రి రియాక్షన్.. ఇది మంచి బడ్జెట్టే.. కాకపోతే!

Kaburulu

Kaburulu Desk

February 1, 2023 | 04:52 PM

Union Budget: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్ధిక మంత్రి రియాక్షన్.. ఇది మంచి బడ్జెట్టే.. కాకపోతే!

Union Budget: నేడు కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్ మంచిదేనని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వెల్లడించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన బుగ్గన.. ఇది గుడ్ బడ్జెట్ అంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు, అన్ని రాష్ట్రాలు రాజకీయాలను పక్కన పెట్టి పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రూ. 45 లక్షల కోట్లు అయితే.. ప్రీ బడ్జెట్‌లో తాము చెప్పిన నాలుగు సూచనలను కేంద్రం పాటించినట్లు కనిపిస్తోందన్నారు.

కేంద్ర బడ్జెట్ లో కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయని బుగ్గన పేర్కొన్నారు. ఆదాయ పన్ను రేట్లు, శ్లాబ్ రేట్లు ఊరటనిచ్చాయని, గతేడాది బడ్జెట్ మూల ధన వ్యయం రూ.7.28 లక్షలు ఉండగా, ఈసారి రూ.10 లక్షలకు పెరిగినట్టు బడ్జెట్ లో చెప్పారని బుగ్గన వివరించారు. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపును రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచటం ఆహ్వానించదగ్గ అంశమని.. మొత్తంగా ట్యాక్స్ రూపంలో సగటు వ్యక్తులకు లాభదాయకంగా ఉంటుందన్నారు.

ఫిషరీస్ మేత దిగుమతి సుంకం తగ్గించమని అడిగామని.. కేంద్రం ఆ మేరకు నిర్ణయం తీసుకుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. విద్య, విద్యుత్, రోడ్లు, మౌలిక సదుపాయాల్లో కేటాయింపులు పెరిగాయన్నారు. విమానాశ్రయాలు, పోర్టులపై కేంద్రం శ్రద్ధ తీసుకోవడం కూడా రాష్ట్రానికి ఉపయోగపడే అంశమన్నారు. ప్రతిసారి కేంద్ర బడ్జెట్ ఓ థీమ్ ప్రకారం రూపొందిస్తున్నారని, ఈసారి 7 ప్రధాన అంశాలను ప్రాతిపదికగా చేసుకుని బడ్జెట్ రూపకల్పన చేశారని వివరించారు.

అయితే, పలు రంగాల్లో కేటాయింపులు తగ్గినట్టు కనిపిస్తోందని.. ముఖ్యంగా యూరియా సబ్సిడీ, వ్యవసాయపరమైన సబ్సిడీలు తగ్గినట్టు కనిపిస్తున్నాయని బుగ్గన వెల్లడించారు. గతేడాది యూరియా సబ్సిడీ రూ.1.54 లక్షల కోట్లు ఉండగా, ఈసారి ఆ సబ్సిడీ రూ.1.31 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలుస్తోండగా.. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తున్న వాటా ఈసారి ఇంకా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, దేశంలో అప్పు గతేడాది కంటే రూ. 50 వేల కోట్లు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.