Medaram Jathara: వనమంతా జనమే.. ప్రారంభమైన సమ్మక్క, సారలమ్మ మినీ జాతర

Kaburulu

Kaburulu Desk

February 1, 2023 | 04:22 PM

Medaram Jathara: వనమంతా జనమే.. ప్రారంభమైన సమ్మక్క, సారలమ్మ మినీ జాతర

Medaram Jathara: పచ్చని అడవిలో ఎటు చూసినా జనమే కనిపిస్తారు.. మెట్రో నగరాల నుండి పల్లెల వరకు దారులన్నీ ఆ అడవి బాట పడతాయి. అదే మేడారం జాతర. మేడారంలో బుధవారం నుండి మినీ వన జాతర మొదలైంది. గిరిజనుల ఆరాధ్య దైవాలుగా కొలుస్తూ.. దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రజలు విశేషంగా దర్శించే సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర కొండాకోనా పరవశించేలా బుధవారం ప్రారంభమైంది.

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచి, జాతీయస్థాయిలో గుర్తించబడిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి చాలా ఘనంగా జరిగే సంగతి తెలిసిందే. కాగా, ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుండి కోట్లాదిగా వచ్చే భక్తులతో మేడారం జన సంద్రాన్ని తలపిస్తుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర.. విగ్రహాలు లేని విశిష్టమైన సమ్మక్క సారలమ్మల జాతర చాలా ప్రశస్తమైనది. అటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర మండ మెలిగే పండుగతో నేటి నుంచి మొదలైంది.

ఆ తర్వాత రేపు ఫిబ్రవరి 2న సమ్మక్క, సారలమ్మ దేవతలకు పసుపు, పచ్చిపూలతో పూజలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో మండ మెలిగే ఆచారం జరగనుంది. గిరిజన జాతరకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఈ మినీ జాతరకు మేడారం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మాత్రమే వచ్చేవారు. ఇప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణతో పాటు ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిస్సా, ఏపీ తదితర రాష్ట్రాల నుండి భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు మేడారం వస్తారు. భక్తుల సంఖ్య పెరగడంతో మినీ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రెండేళ్లకు ఓసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.. మధ్యలో మినీ జాతర పేరిట ఈ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. మినీ జాతరకు సైతం లక్షలలోనే భక్తులు విచ్చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.