Bank Employees: వారానికి ఐదు రోజుల పని విధానం.. బ్యాంకులు ఇకపై వారానికి ఐదు రోజులే!

Kaburulu

Kaburulu Desk

March 2, 2023 | 01:07 PM

Bank Employees: వారానికి ఐదు రోజుల పని విధానం.. బ్యాంకులు ఇకపై వారానికి ఐదు రోజులే!

Bank Employees: వారానికి ఐదు రోజుల పని విధానం అమలు కాబోతుంది. దీని ప్రకారం బ్యాంకులు ఇకపై వారానికి ఐదు రోజులే పనిచేస్తాయి. ఇది ఒకరకంగా బ్యాంక్ సిబ్బందికి, ఉద్యోగులకు శుభవార్త కాగా.. వినియోగదారులకు మాత్రం బ్యాడ్ న్యూసే. బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజులే పని చేసేలా నిబంధనలు మార్చాలని ఐబీఏ (Indian Banks Association)కు బ్యాంకు ఉద్యోగుల సంఘం (UFBE) ప్రతిపాదించింది.

ప్రస్తుతం నెలలోని ప్రతి ఆదివారంతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారాల్లో బ్యాంకులు పని చేయడం లేదు. అయితే, రెండో శనివారం, నాలుగో శనివారం అంటూ వద్దని.. ఏ వారంలోనైనా ఐదు రోజులు మాత్రమే పని చేస్తామని, అన్ని శనివారాలు కూడా సెలవుగా ప్రకటించాలని బ్యాంక్‌ ఉద్యోగ సంఘాలు కొన్ని సంవత్సరాలుగా డిమాండ్‌ చేస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (Indian Banks Association-IBA) బ్యాంక్‌ యూనియన్ల డిమాండ్‌ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఒకేవేళ ఐదు రోజుల పని డిమాండ్‌కు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఓకే చెబితే, ఆ తర్వాత ఆ ప్రతిపాదన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరుతుంది. అక్కడ కూడా ఆమోదముద్ర పడితే, ఆ తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) వద్దకు వెళుతుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) కూడా ఒప్పుకుంటే, కేంద్ర బ్యాంక్‌ విధించే షరతులకు లోబడి వారానికి ఐదు రోజుల పని విధానం బ్యాంకుల్లో అమలవుతుంది.

ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఇకపై అన్ని శనివారాలు, ఆదివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే, ఈ విధానం అమలు చేయాలంటే పని వేళలు కూడా పెంచాల్సి ఉంటుంది. వారంలో ఐదు పని దినాల్లో రోజుకు 40 నిమిషాల పాటు పని వేళలు పెంచాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు పనివేళలు ఉండగా.. మారే విధానంతో ప్రతి రోజూ ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనివేళలు ఉండే అవకాశం ఉంటుంది.