Jagtial Collector: కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదు.. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు!

Jagtial Collector: బీర్లు ఎన్ని ఉన్నా.. కింగ్ ఫిషర్ బీర్ కిక్కే వేరంటారు మందు బాబులు. అంతలా బీర్లలో కింగ్ ఫిషర్ బీర్ రారాజుగా పిలుచుకుంటారు. అయితే, అలాంటి కింగ్ ఫిషర్ బీర్లు వైన్ షాప్స్ లో దొరకడం లేదు. దీంతో మా దగ్గర వైన్ షాప్ లో కింగ్ ఫిషర్ బీర్ దొరకడం లేదు సార్.. ఆ బీర్ కోసం రోజు 30 కిమీ దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది. కాస్త ఈ సమస్యను పరిష్కరించండి సార్ అంటూ.. ఏకంగా ప్రజావాణి కార్యక్రమంలో ఓ యువకుడు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు.
ఈ వింత సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల పట్టణంలోని వైన్స్ షాప్స్, బార్లలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని భీరం రాజేష్ అనే యువకుడు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు లిఖితపూర్వకంగా ఒక వినతిపత్రం కూడా కలెక్టర్‌కు అందజేశాడు. అక్కడ తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నాడు. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఇది చూసి ఆశ్చర్యపోయారు.
మా ప్రాంతంలో ఆ బీర్లు దొరకకపోవడంతో 20 నుండి 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని వినతి పత్రంలోనే ఆవేదన చెందాడు. బెల్ట్ షాప్‌లలో ఎక్కువ రేట్లకు కింగ్ ఫిషర్ బీర్లు అమ్ముతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని రాజేష్ డిమాండ్ చేశాడు. జగిత్యాల పట్టణంలో ఉన్న అన్ని వైన్స్ షాప్స్, బార్లలో అన్ని రకాల బీర్లు లభించే విధంగా చర్యలు తీసుకోవాలని.. వైన్ షాపులలో నాసిరకమైన బీర్లు అమ్ముతున్నారని, దీని వల్ల మందుబాబుల ఆరోగ్యం పాడవుతుందని చెప్పాడు.
వైన్ షాపులలో దొరక్కుండా బెల్టు షాపులలో బీర్లు దొరుకుతున్నాయని, బెల్టు షాపులలో దొరికేవి ఒరిజినలా? లేదా నకిలీవా? అనేది కూడా అర్ధం కావడం లేదన్నాడు. ప్రస్తుతం అతడి వినతిపత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మందుబాబుల తరపున తన వాణి వినిపించాడని కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. మరి అతడి సమస్యను ప్రభుత్వం
పరిష్కరిస్తుందా? కలెక్టర్ ఈ సమస్యపై దృష్టి పెడతారా లేదా అన్నది చూడాలి!