Glider Plane Collides on House: విమానంలో సాంకేతిక లోపం.. ఇంటిపై కూలి ముక్కలుముక్కలు

Kaburulu

Kaburulu Desk

March 24, 2023 | 01:55 PM

Glider Plane Collides on House: విమానంలో సాంకేతిక లోపం.. ఇంటిపై కూలి ముక్కలుముక్కలు

Glider Plane Collides on House: రన్ వే పై నుంచి గాల్లోకి లేచిన కాసేపటికే ఓ విమానం గాల్లో చక్కర్లు కొట్టి ప్రమాదానికి గురైంది. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన చిన్న గ్లైడర్ విమానం కంట్రోల్ తప్పి ఓ ఇంటిపైన కూలిపోయింది. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ సిటీలో జరిగిన ఈ ప్రమాదంలో పైలట్ కు, అందులో ప్రయాణిస్తున్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు ఆ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో విమానం ముక్కలు ముక్కలైంది.

సిటీ టూర్ లో భాగంగా బర్వాడ్ద ఏర్ స్ట్రిప్ నుంచి గ్లైడర్ విమానం బయల్దేరింది. అరకిలోమీటర్ వెళ్లగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆపై కంట్రోల్ తప్పి ఓ ఇంటి పిల్లర్ ను ఢీకొట్టింది. సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లిన విమానం ముక్కలు ముక్కలైంది. గురువారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విమాన ప్రమాదం గురించి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

ముందుగా బాధితులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు ప్రమాదంపై విచారణ మొదలు పెట్టారు. ఆకాశంలో ఎగురుతున్న విమానం ఒక్కసారిగా తమ ఇంటిపై కూలడంతో భయాందోళనలకు గురయ్యామని ఆ ఇంటి యజమాని నీలేశ్ కుమార్ చెప్పారు. అయితే, ఈ ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు ఎవరికీ ఏమీ కాలేదని వివరించారు. కాగా, ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్యేనని అధికారులు ప్రాథమికంగా తేల్చారు.

అయితే, విచారణ పూర్తయితే కానీ ప్రమాదానికి అసలు కారణమేంటనేది తెలియదని చెప్పారు. నగర అందాలను ఆకాశం నుండి చూసి ఆనందించడం కోసం ఈ గ్లైడర్ సర్వీస్ ప్రారంభించబడింది. గ్లైడర్ సర్వీస్ ప్రారంభమైన దగ్గర నుండి డిమాండ్ పెరగగా.. ఇప్పుడు ఈ ప్రమాదం తర్వాత నగరంలో ఏరియల్‌ టూర్‌ను ప్రస్తుతానికి నిలిపివేశారు.