Los Angeles Police: రూ.200 కిమీ వేగంతో దొంగా పోలీస్ ఛేజింగ్.. హాలీవుడ్ సినిమాని తలపించిన సీన్!

Los Angeles Police: ఓ దొంగ తన రేస్ కార్ తో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు రయ్యిమని దూసుకెళ్తాడు. మధ్యలో బ్రిడ్జ్ లు, ట్రాఫిక్ లాంటి వాటి దగ్గర జంపింగ్ లు.. ఎదుర్కొచ్చిన వాళ్ళని డాష్ కొట్టుకుంటూ దూసుకెళ్తాడు. ఆ వెనక పోలీసులు తమ వాహనాలలో అదే రేంజిలో దొంగలను వెంటాడి పట్టుకుంటారు. హాలీవుడ్ సినిమాలలో అయితే ఈ సీన్లు ఓ రేంజిలో ఉంటాయి. అలాంటి ఛేజింగ్ సీన్ అదే స్థాయిలో కళ్ళ ముందు కనబడితే ఎలా ఉంటుంది?!
అమెరికాలోని లాస్ఏంజిల్స్ అదే జరిగింది. హాలీవుడ్ సినిమాని మించిన స్థాయిలో దొంగా పోలీస్ ఛేజింగ్ జరిగింది. సినిమాలలో చూపించే మాదిరే పోలీసులు ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకున్నారు. ఈ మధ్య కాల్పులు.. రేసింగ్ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయుధాలు పట్టుకున్న ఓ వ్యక్తి కారును దొంగిలించి వెళ్తుండగా పోలీసులు అతడిని విశ్వప్రయత్నం చేసి పట్టుకున్నారు.
లాస్ ఏంజిల్స్ రోడ్లపైన మెరుపు వేగంతో తప్పించుకునేందకు ప్రయత్నించిన దొంగ.. కారును నడుపుతూనే తనను పట్టుకునేందుకు వస్తున్న పోలీసులపైన కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా దొంగపై అదే స్థాయిలో కాల్పులు జరిపాడు. ఈ ఛేసింగ్ కొన్ని గంటల పాటు సాగింది. గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈ దొంగా, పోలీస్ ఛేజ్ సాగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
ఫైనల్ గా ఓ వాహనాన్ని ఢీకొట్టిన నిందితుడి కారు అదుపుతప్పి పక్కనే ఉన్న స్థంభాన్ని ఢీ కొట్టింది. అనంతరం కారు నుంచి దిగి నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు తమ కార్ల నుంచి దిగి దొంగను పట్టుకుని అరెస్ట్ చేశారు. సినీ స్టైల్లో సాగిన ఈ ఛేజింగ్ చూసి లాస్ ఏంజెల్స్ ప్రజలు అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు సినిమాలలో మాత్రమే చూడడమే కానీ.. ఈ స్థాయిలో రియల్ ఛేజింగ్ సీన్ చూడడం ఇదే తొలిసారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.