Dinosaur Nests: నర్మదా నదిలో దొరికిన 256 డైనోసార్ గుడ్లు.. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

Kaburulu

Kaburulu Desk

January 22, 2023 | 05:05 PM

Dinosaur Nests: నర్మదా నదిలో దొరికిన 256 డైనోసార్ గుడ్లు.. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

Dinosaur Nests: ఈ భూగ్రహం మీద మనిషి మనుగడ మొదలవక ముందే డైనోసార్లు అంతమైపోయాయని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. అయితే పుస్తకాలు, సినిమాలు, డాక్యుమెంట్ల పుణ్యమా అని డైనోసార్లు ఎలా ఉండేదో తెలుసుకోగలుగుతున్నాం. పరిశోధనల ప్రకారం ఎన్నో వేల ఏళ్ల కిందట డైనోసార్లు కనుమరుగవగా ఇప్పటికీ.. వాటి ఆనవాళ్లు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి.

తాజాగా మధ్యప్రదేశ్ లోని నర్మద లోయలో డైనోసార్ల గుడ్లు బయటపడ్డాయి. అది కూడా ఒకటో రెండో కాదు. ఏకంగా 256 గుడ్లు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ అయింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌కు చెందిన శిలాజ శాస్త్రవేత్తలు ధార్ జిల్లాలోని బాగ్, కుక్షి ప్రదేశాల్లో తవ్వకాలు జరిపిన సమయంలో ఈ పొడవాటి మెడతో ఉండే శాఖాహారులైన టైటానోసార్‌లకు చెందిన 256 గుడ్లు, పలు గూళ్లు వెలుగులోకి వచ్చాయి.

పీఎల్ఓఎస్ ఒన్ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఈ డైనోసార్స్ గూళ్లు, గుడ్లు 66 మిలియన్ ఏళ్ల క్రితం ఉనికిలో ఉన్న పొడవైన మెడ కలిగిన డైనోసార్ జాతికి చెందినదిగా వెల్లడించారు. నర్మదా లోయలో దొరికిన గూళ్లు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయని.. సాధారణంగా డైనోసార్ గూళ్లు ఒకదానికి ఒకటి కొంతదూరంలో ఉంటాయి. కానీ నర్మదా నదిలో దొరికిన డైనోసార్ శిలాజాలు ఇందుకు భిన్నంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నా రు.

దొరికిన గుడ్ల శిలాజాలు 15 సెం.మీ మరియు 17 సెం.మీ వ్యాసం కలిగి ఉండగా.. ఒక్కో గూడులోని గుడ్ల సంఖ్య ఒకటి నుండి 20 వరకు ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. పొదగడానికి అనువైన పరిస్థితులు లేక తల్లి గుడ్లను అండవాహికలోనే ఉంచుకోవడంతో గుడ్లకు పెంకుపై పెంకు రెండు పొరలుగా ఏర్పడినట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ గుడ్లు దాదాపు 6.6 కోట్ల సంవత్సరాల కిందట జీవించిన డైనోసార్లవిగా గుర్తించారు.