BRS Party: కేసీఆర్ రెండో సభకి ముహూర్తం ఫిక్స్.. సభా స్థలం ఎక్కడంటే?

Kaburulu

Kaburulu Desk

January 22, 2023 | 04:38 PM

BRS Party: కేసీఆర్ రెండో సభకి ముహూర్తం ఫిక్స్.. సభా స్థలం ఎక్కడంటే?

BRS Party: జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ జాతీయ స్థాయిలోనే దూకుడు పెంచేందుకు సన్నాహాలు మొదలవుతున్నాయి. ఈ మధ్యనే ఖమ్మం వేదికగా మరో ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ సమరశంఖం ఊదేశారు. ఖమ్మం సభ తర్వాత పొరుగు రాష్ట్రాలలో కూడా బీఆర్ఎస్ భారీ బహిరంగసభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. నిజానికి సంక్రాంతి తర్వాత వరసగా సభలు నిర్వహించే ఛాన్స్ ఉందని అనుకున్నారు.

కానీ.. బడ్జెట్ సమావేశాలు ఉండడంతో ఇది కాస్త మరో నెల వెనక్కు వెళ్ళింది. దీంతో ఫిబ్రవరి మూడవ వారం లేదా చివరి వారం నుండి ఈ సభలకు ముహుర్తాలు ఖరారు కానుంది. ఖమ్మం సభ తెలంగాణ పరిధిలోదే కాగా.. తర్వాత సభ ఏపీలో ఉండే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. అందునా ఉత్తరాంధ్రలో సభ జరగనుందని సాక్షాత్తు బీఆర్ఎస్ నేతలే చెప్పుకొచ్చారు. కానీ.. తర్వాత సభ ఏపీలో కాకుండా మహారాష్ట్రలో జరగనుందని తెలుస్తుంది.

బీఆర్ఎస్ పార్టీ రెండవ బహిరంగ సభను మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా నాందేడ్, ఔరంగబాద్, ఉస్మానాబాద్‌లో సభ కోసం ఆరా తీసిన నేతలు చివరికి నాందేడ్ లో ఖరారు చేశారు. నాందేడ్‌ పక్కనే తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఉండగా.. వారితో తెలంగాణ ప్రజలకు బాండింగ్ ఉంది. జనసమీకరణ సమస్య లేకుండా ఉంటుందనే నాందేడ్ లో సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.

నాందేడ్‌లో మెజార్టీ వ్యాపార సంస్థలు తెలంగాణ సెటిలర్లవే కాగా.. అది కూడా ఒకప్పుడు నిజాం పాలనలోని ప్రాంతమే కావడంతో అక్కడి ప్రజల ఆహార అలవాట్లు, సంప్రదాయాలు తెలంగాణ ప్రజలకు దగ్గరగానే ఉంటాయి. రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలను మెచ్చిన అక్కడి ప్రజలు తమని తెలంగాణలో కలపాలని కూడా డిమాండ్ చేసినట్లు గతంలో టీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. దీంతో అక్కడ సభ నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాదనే అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నాందేడ్ లో వ్యాపారాలు కలిగిన నిజామాబాద్, ఆదిలాబాద్ నేతలను అక్కడే తిష్టవేసి ఆ ఏర్పాట్లను పర్యవేక్షించాలని కూడా అధిష్టానం నుండి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తుంది.