Gold Price Today: రూ.60,000 దాటి రికార్డు సృష్టించిన గోల్డ్.. ఒక్కరోజులోనే పెరిగిన రూ.1600 ధర!

Kaburulu

Kaburulu Desk

March 19, 2023 | 10:02 AM

Gold Price Today: రూ.60,000 దాటి రికార్డు సృష్టించిన గోల్డ్.. ఒక్కరోజులోనే పెరిగిన రూ.1600 ధర!

Gold Price Today: అసలే పెళ్లిళ్ల సీజన్.. ఎంతో కొంత బంగారం కొనాలని మధ్య తరగతి నుండి ఎగువ తరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే వారికి ఇది షాకింగ్ న్యూస్. పసిడి రేటు పరుగులు పెడుతోంది. ఎన్నడూ లేనంతగా కొండెక్కి కూర్చుంది. గోల్డ్ రేట్ ఇప్పుడు ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. బంగారం ధర కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. పసిడి రేటు ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేస్తూ ఏకంగా రూ. 60 వేలు దాటిపోయింది.

మన దేశంలో బంగారం ధర తొలిసారిగా రూ.60,000 స్థాయిని దాటి రికార్డు సృష్టించింది. అమెరికాలో బ్యాంకింగ్‌ సంక్షోభం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమనగా.. శనివారం ఇక్కడి స్టాక్ మార్కెట్లో పైకి ఎగిసింది. హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి తులం ధర రూ.1,630 పెరిగి రూ. 60,320 వద్ద నిలిచింది. ఇక, దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ ఇదే స్థాయిలో పెరుగుదల సంభవించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగులు పెట్టడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే మన దేశంలో కూడా బంగారం ధరలు పెరిగాయని తెలియజేస్తున్నారు. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒకే రోజు రూ.1630 మేర పెరిగి రూ. 60,320 స్థాయికి చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.1500 మేర పెరిగి రూ. 55,300 స్థాయికి చేరింది.

బంగారం ధర గత మూడు రోజుల్లో దాదాపు రూ. 2,500 వరకు పెరిగింది. 10 రోజుల్లో రూ.5,000 వరకూ పెరిగింది. మార్చి 9న రూ.55,530 వద్దనున్న ధర 18కల్లా రూ.60,320 వద్దకు చేరగా.. తాజాగా 22 క్యారెట్ల ధర రూ.1,500 అధికమై రూ.55,300 పలికింది. మార్చి 9న దీని ధర రూ. 50,900. పుత్తడి పెరిగినంత స్థాయిలో కాకపోయినా వెండి ధర కూడా అదే బాటలో ఎగబాకుతుంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 1,300 మేర పెరిగి రూ. 74,400 వద్దకు చేరింది.