Halari Donkey: గాడిదకు సీమంతం.. గాడిద పిల్లకు బారసాల.. వీళ్ళు సంథింగ్ స్పెషల్ గురూ!

Kaburulu

Kaburulu Desk

February 27, 2023 | 12:54 PM

Halari Donkey: గాడిదకు సీమంతం.. గాడిద పిల్లకు బారసాల.. వీళ్ళు సంథింగ్ స్పెషల్ గురూ!

Halari Donkey: ఈ మధ్య మన దేశంలో పశువులు, జంతువుల పట్ల వైఖరి మారుతుంది. వాటిని పూజించడం, ప్రేమించడం ఎక్కువైంది. అందుకే గోమాతలకు సీమంతాలు, లేగదూడలకు బారసాలలు అప్పుడప్పుడు వార్తలు అవుతున్నాయి. అయితే.. వీళ్ళు ఇంకా స్పెషల్ అనిపించుకుంటున్నారు. గాడిద గర్భం దాల్చితే సీమంతం చేస్తారు.. గాడిదకు బిడ్డ పుడితే బారసాల చేస్తారు. గాడిదకు సంబంధించి ఏదైనా ఇక్కడ ప్రజలు సంబరాలు చేసుకుంటారు.

గుజరాత్ లోని రాజ్ కోట్ లో గాడిదలకు సామూహిక సీమంతాలు చేశారు. ఇటీవలే గాడిద పిల్లకు బారసాల కూడా చేశారు. ఇక్కడ ప్రజలు 33 గాడిదలకు ఒకేసారి సీమంతం చేయడం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా బలమైన కారణం ఉందట. ఇక్కడ రాజ్ కోట్ ప్రాంతం హలరీ గాడిదలకు ఫేమస్. ఎక్కువ పని చేయడం, ఎంత దూరమైనా అలసట లేకుండా ప్రయాణించడం వీటి ప్రత్యేకత.

అయితే రాను రాను యాంత్రీకరణతో గాడిదల వాడకం తగ్గగా.. వీటి జాతి కూడా అంతరిస్తోంది. ప్రస్తుతం అక్కడక్కడా గాడిద పాలకోసం వీటిని పెంచుతున్నారు. ఈ క్రమంలోనే వీటి జాతిని కాపాడటం కోల్కి గ్రామ ప్రజలు నడుం బిగించారు. గాడిదలను ప్రత్యేకంగా పెంచుతున్నారు. గాడిదలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమమైనా ఇక్కడి ప్రజలు సంబరంగా జరుపుకుంటారు. ఆనందంగా మిఠాయిలు తినిపించుకుంటారు.

మనుషులకు చేసిన విధంగానే గాడిదలకు కూడా బారసాల, సీమంతం నిర్వహిస్తారు. వారంతా కలిసి ఆ పిల్లను శుభ్రం చేసి అందంగా అలంకరించి బారసాల చేస్తారు. గర్భం దాల్చిన గాడిదలకు నుదుటిన ఎర్రటి తిలకం దిద్ది, వీపుపై ఎర్రటి వస్త్రాలు కప్పి.. మహిళలు అనేక పూజలు చేసి.. వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తారు. ఈ వేడుకలను తిలకించేందుకు గ్రామస్థులు, జంతుప్రేమికులు భారీగా తరలివస్తారు. ఆ మధ్య జరిగిన ఒక వేడుకకు అయితే కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా పాల్గొన్నారు.