Yaganti:పెరిగే నంది విగ్రహం… ఎక్కడో తెలుసా..?

Kaburulu

Kaburulu Desk

December 15, 2022 | 09:30 PM

Yaganti:పెరిగే నంది విగ్రహం… ఎక్కడో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో గల ప్రసిద్ధ శైవ క్షేత్రం యాగంటి ఉమామహేశ్వర దేవాలయం. ఈ దేవాలయం లో గల నంది విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం లో కూడా ఈ నంది ప్రస్తావన ఉంది. అంతకంతకూ పెరిగిన నంది విగ్రహం రంకె వేస్తే కలియుగం అంతరించి పోతుందని వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానం లో పేర్కొన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయం విశేషాలు మరిన్ని తెలుసుకోండి…

ఏ శివాలయంలో అయినా శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. కానీ ఈ యాగంటి ఉమామహేశ్వర ఆలయంలో శివుడు పార్వతీ సమేతంగా ఉండి విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్న అనేక విశిష్టతలలో ఇదీ ఒకటి. మరి ఇక్కడి ఇంకో ప్రత్యేకత ఏంటంటే శివుడికి ఎదురుగా నంది ఉండకుండా కొంచం పక్కకు ప్రతిష్టించబడి ఉంటుంది. కారణమేమంటే ఇక్కడ శివుడితో పాటు శక్తిరూపమైన పార్వతీ కూడా ఉండటమే. శక్తికి ఎదురుగా ఎవరూ నిలబడలేరు కాబట్టే నందీశ్వరుడు పక్కకు ప్రతిష్టించబడి ఉంటాడు.

ఈ క్షేత్రంలో ఇంకా… సహజసిద్ధమైన గుహలు, అగస్త్యుడు తపస్సు చేసిన స్థలము, తిరుమల శ్రీవారి కంటే పురాతనమైన వెంకటేశ్వర స్వామి విగ్రహము ఉన్నాయి. ఇక్కడి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించవు. కారణం అగస్త్యుడు తప్పస్సుకు భంగం కలిగించిన కాకులకు శాపం తగలటమే. చాలా ఆసక్తికరంగా ఉన్నాయి కదూ…. ఈ విషయాలు…!