Sangameshwar Temple:ఏడాది మొత్తం నీటిలో ఉండి కేవలం 4 నెలలు మాత్రమే దర్శనమిచ్చే దేవాలయమేదో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 15, 2022 | 09:26 PM

Sangameshwar Temple:ఏడాది మొత్తం నీటిలో ఉండి కేవలం 4 నెలలు మాత్రమే దర్శనమిచ్చే దేవాలయమేదో తెలుసా…?

విశాల భారతదేశంలో ఉన్న అనేక దేవాలయాలు ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి దగ్గర్లో గల కృష్ణా నదిలో ఉన్న సంగమేశ్వర ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు పాటు మాత్రమే భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తుంది. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పవిత్రస్థలం ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతమని చెబుతుంటారు. మరి ఈ ఆలయాన్ని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి…!

నివృత్తి సంగమేశ్వరాలయం అనికూడా పిలవబడే ఈ ఆలయం ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం జలాశయం లోని నీటి మట్టం తగ్గినప్పుడు నీటి ఉపరితలం పైకి వస్తుంది. అలా బయట పడే నాలుగు నెలలు అనగా మార్చి, ఏప్రిల్, మే జూన్ నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు. ఇక్కడి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇది ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం.

ఆలయం వెనక ఉన్న పురాణ కథను చూస్తే… పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని, సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధి కెక్కిందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. మరొక కథనం ప్రకారం పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాకపోవడంతో, ఋషుల సూచన మేరకు ధర్మరాజు వేపమొద్దుని శివలింగంగా తయారు చేసి ప్రతిష్ఠించి పూజలు చేశాడు. దీంతో, కోపోద్రిక్తుడైన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి ధర్మరాజు అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని కూడా ఇక్కడి స్థల పురాణం చెబుతోంది.