Vithalanatha standing on a brick: ఇటుకపై నిలబడ్డ విఠలనాథుడి దేవాలయం ఎక్కడుందో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 10:39 PM

Vithalanatha standing on a brick: ఇటుకపై నిలబడ్డ విఠలనాథుడి దేవాలయం ఎక్కడుందో తెలుసా…?

భారతదేశంలో ఉన్న ప్రతీ దేవాలయానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతలే ఆ ఆలయాలు ప్రసిద్ధం అవడానికి కారణం అవుతాయి. అందులో ఉన్న ఒకానొక ప్రత్యేకత కలిగిఉన్న ఆలయమే మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో గల పండరీపూర్ విఠలనాథ ఆలయం. ఇక్కడి ఆలయంలో కొలువుతీరిన విఠలేశ్వరుడి విగ్రహం ఇటుకలపై నిలబడి ఉంటుంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇదే అక్షరాలా నిజం. మరి ఈ ఆలయం ఎక్కడుందో ఇంకా ఆ ఆలయ విశేషాలేమిటో ఇపుడు తెలుసుకుందాం.

శ్రీమహా విష్ణువు మరో పేరే పాండురంగ విఠలుడు, విఠోబా.  విఠలుడి మందిరాలు మన ప్రాంతంలో తక్కువైనా, మహారాష్ట్రలో మందిరాలు, భక్తులు ఎక్కువ.  వీటిలో ముఖ్యమైనది పండరీపురంలోని పాండురంగడి మందిరం.  పాండురండు అనగానే మనకు గుర్తొచ్చేవి పాండురంగ మహత్యం, సతీ సక్కుబాయి, భక్త తుకారాం సినిమాలు.  వాటిమూలంగానే తెలుగువారిలో ఎక్కువమందికి పాండురంగవిఠలుని చరిత్ర తెలిసింది. భారత దేశంలో శ్రీకృష్ణుడు అనేక రూపాలలో ప్రసిధ్ధి చెందిన ధామాలు ఎన్నో వున్నాయి,   ఉదాహరణకు తూర్పున పూరీ, పడమరలో ద్వారక, ఉత్తరాన మధుర, బృందావనం, బదరీ, దక్షిణాన ఉడిపి, గురువాయూర్, పండరీపురం ప్రఖ్యాతి చెందినవి.

ఇక్కడి పాండురంగడు రెండు చేతులూ నడుము మీద పెట్టుకుని, ఇటుక మీద నిలబడి దర్శనమిస్తాడు.  ఆ ఇటుక గురించి తెలసుకోవాలంటే పుండరీకుని కథ తెలుసుకోవాలి. నడుముమీద చేతులు పెట్టుకున్న ఆయన ఎడమ చేతిలో శంఖముంటుందిగానీ, వస్త్రాలంకరణలో అది మనకు కనబడదు. ఆలయ సమీపంలోనే భీమానది ప్రవహిస్తూవుంటుంది. ఇందులో చాలా మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి విఠలుడి దర్శనార్థం దేవాలయానికి వెళుతుంటారు. ఇక్కడి వాతావరణం ప్రకృతి శోభ మాటల్లో వర్ణించలేనిది… మహారాష్ట్రకు వెళ్ళినపుడు మీరూ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు కదూ….!