Sankranti 2023: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు.. అందంగా ముస్తాబైన ఊరూవాడ

Kaburulu

Kaburulu Desk

January 15, 2023 | 08:39 AM

Sankranti 2023: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు.. అందంగా ముస్తాబైన ఊరూవాడ

Sankranti 2023: సంక్రాంతి పండుగంటేనే ప్రతి ఇంటా ఘుమఘుమలాడే పిండి వంటలు.. ఆకాశంలో ఎగిరే పతంగులు, వాకిళ్లలో పరుచుకునే రంగురంగుల ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, పిల్లలు,పెద్దలు ఆటపాటలతో సందడి చేసే పల్లెలు, పట్టణాలు, నగరాలు. వాడవాడలా సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. పిండివంటల రుచులు, ముగ్గుల పోటీలు, కళా-సాంస్కృతిక కార్యక్రమాలతో రాష్ట్రం నలుమూలలా సంక్రాంతి శోభ సంతరించుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. వారాంతంలోనే పెద్ద పండుగ కూడా కలిసి రావడంతో చదువు, ఉద్యోగరీత్యా పట్టణాలు, నగరాలకు వెళ్లిన వాళ్ళు కూడా తిరిగి వారు స్వగ్రామాలకు తరలిరావడంతో పల్లెలన్నీ సందడిగా మారాయి. పలు కార్యక్రమాలతో రాష్ట్రమంతటా కోలాహలంగా మారింది. ఇటు ప్రభుత్వాలు కూడా అధికారికంగా పండగను సెలెబ్రేట్ చేయడంతో ఎటు చూసినా సరదాల సంక్రాంతిగా మారిపోయింది.

మకర సంక్రాంతి అని కూడా పిలువబడే ఈ పండుగను కొత్త సౌర సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు కనుక.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్రంలోని పలు ఆలయాలలో వైభవంగా పూజలు జరుగుతుండగా.. సంక్రాంతిని పురస్కరించుకుని ఏపీ, తెలంగాణలలో గాలిపటాల పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు.

మరోవైపు పసందైన వంటకాల ఘుమఘుమలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. భోగి మంటలు, రేగి పండ్లు, పసందైన వంటకాలు, పొంగళ్లు, రంగవల్లికలతో తెలుగు రాష్ట్రాలు కళకళలాడుతున్నాయి. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతిని బాగా జరుపుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు టాలీవుడ్ నుంచీ అదిరిపోయే సినిమాలు రావడంతో… అవి కూడా సంక్రాంతిని మరో మెట్టు పైకి ఎక్కించాయి. ఇక, ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఇలా సోషల్ మీడియా కూడా సంక్రాంతి స్టేటస్ ల సందడిగా మారిపోయింది.

అయితే, సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. తెలుగు రాష్ట్రాల్లో వరి పంట కోతకు వచ్చే సమయం ఇదే. ఈ టైంలో చక్కటి దిగుబడి వస్తే రైతు కళ్లలో ఆనందం కనిపిస్తుంది. మద్దతు ధర, మార్కెటింగ్ ఫెసిలిటీస్, కోల్డ్ స్టోర్స్, ప్రోసెసింగ్ యూనిట్స్ ఇలా అన్నీ ఉన్నప్పుడే రైతు మనసులో నిజమైన ఆనందం ఉంటుంది. ప్రతీ ఒక్కరూ రైతు సంతోషాన్ని కోరుకోవాలి. అదే నిజమైన సంక్రాంతి కూడా. ఇకనైనా ప్రభుత్వాలు ఆ దిశగా అలోచించి రైతు క్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని ఈ మకర సంక్రాంతి సాక్షిగా కోరుకుందాం.