Minister KTR: మోడీ హామీలకు టైమ్ వచ్చేసింది.. నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 09:28 PM

Minister KTR: మోడీ హామీలకు టైమ్ వచ్చేసింది.. నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ

Minister KTR: తెలంగాణకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కోరిన కేటీఆర్.. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లేనని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్‌లకు జాతీయ ప్రాధాన్యత వుందని.. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్‌లకు ఆర్ధిక సాయం చేయాలని కేటీఆర్ కోరారు.

అంతేకాదు, బ్రౌన్ ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల మంజూరు, అప్‌గ్రేడేషన్ కూడా చేయాలని మంత్రి కోరారు. ఆదిలాబాద్‌లోని సీసీఐ యూనిట్‌ను పునరుద్ధరించాలని, హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని, ఐటీఆర్ లేదా సమాన ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆయన కోరారు.

జ‌డ్చ‌ర్ల పారిశ్రామిక పార్కులో ఉమ్మ‌డి వ్య‌ర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామ‌న్న కేటీఆర్ రాష్ట్రంలో పరిశ్ర‌మ‌ల‌కు ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాలు అందించాల‌ని ఎనిమిదేండ్లుగా కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసినా ఫ‌లితం లేద‌ని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అద్భుత పారిశ్రామిక ప్రగతి సాధిస్తోందని.. తెలంగాణకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని నిర్మలా సీతారామన్ కి రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.

గత ఎనిమిదేళ్లలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకమని.. రాష్ట్ర అభివృద్ధిలో భాగమైన అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులకు జాతీయ ప్రాధాన్యత ఉందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో చేపట్టిన కార్యక్రమాలకు రానున్న కేంద్ర బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కేటీఆర్ కోరారు. మరి కేంద్రం ఈ లేఖపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉండగా.. రాష్ట్ర బీజేపీ నేతలు ఈ లేఖపై రియాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో కూడా చూడాలి.