Santh Ravidas birthday: సామాజిక సమరసతా మూర్తి సంత్ రవిదాస్ జయంతి నేడు..! జీవిత విశేషాలేమిటో తెలుసా?

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 12:34 PM

Santh Ravidas birthday: సామాజిక సమరసతా మూర్తి సంత్ రవిదాస్ జయంతి నేడు..! జీవిత విశేషాలేమిటో తెలుసా?

సంత్ రవిదాస్ క్రీ.శ. 1377లో కాశీవద్ద సీర్ గోవర్దనపురం అనే గ్రామంలో, మాఘపూర్ణిమ రోజున చర్మకార కుటుంబంలో జన్మించారు. కలసాదేవి, సంతోఖ్‌దాస్ తల్లిదండ్రులు. ఆనాటి సామాజిక పరిస్థితిలో రవిదాస్‌కు పాఠశాలకు వెళ్ళే అవకాశం ఎక్కడిది? పూర్వజన్మ సుకృతమేమో కానీ చిన్ననాటనే ప్రహ్లాదునివలే దైవభక్తి ఏర్పడింది. దేవాలయంలోకి వెళ్ళే అనుమతి లేదు. దేవాలయం బయట నిలబడి దేవాలయాలంలోని భక్తి గీతాలను శ్రద్ధగా వినేవాడు. మననం చేసుకునేవాడు. ఇలా అనేక భక్తిగీతాలు కంఠస్థమయ్యేవి. తనివితీరా గంగానదిలో ఈతకొట్టేవాడు.

పధ్నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ ముస్లిం ఆక్రమణకారుల పట్టుబిగిసింది. బలవంతపు మత మార్పిడులు సామూహికంగా జరుగుతున్న కాలమది. రెండవవైపు హిందూ సమాజంలో కులం పేరుతో అసమానతలు, అంటరానితనం తీవ్రంగా వున్న కాలమది. అనేక రూపాల్లో దురాచారాలు, మూఢాచారాలు ఉన్నకాలమది. ఆ చీకటియుగంలో జన్మించిన రవిదాస్ సుమారు 120 సంవత్సరాలు జీవించారు.

తన భక్తిగీతాల ద్వారా భక్తి ఉద్యమానికి తెరతీశారు. ఆనాడు, తరువాత కాలంలో పండితులు, మహారాజులు, సామాన్యులు, పామరులు అందరూ వారి భక్తులయ్యారు. సంత్ శిరోమణిగా అందరిచే కొనియాడబడ్డారు. నేటికీ ఉత్తరభారతంలో వారి శిష్యులుగా భక్తి ఉద్యమానికి ప్రచారకులుగా పనిచేస్తున్నవారు ఎందరో వున్నారు. సంత్ రవిదాస్ దేవాలయాలు దేశంలో విదేశాలలో ధార్మిక, సామాజిక శ్రద్ధా కేంద్రాలుగా, ప్రేరణా కేంద్రాలుగా స్ఫూర్తినిస్తున్నాయి.