Bharathamatha Temple: భారతమాత దేవాలయం ఎక్కడుందో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

January 1, 2023 | 10:35 PM

Bharathamatha Temple: భారతమాత దేవాలయం ఎక్కడుందో తెలుసా…?

సకల సంపదలకు నిలయమైన మన భారతదేశాన్ని విశ్వగురువుగా భావిస్తూ, మన దేశాన్ని మాతృమూర్తిగా భావిస్తూ భారతమాతగా పిలుచుకుంటాం. మరి ఈ భారతమాతకు కూడా ఒక దేవాలయం ఉందని, ఆ ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయని తెలుసా…? అయితే ఆలస్యం చేయకుండా ఈ వ్యాసం చదివి భారతమాత దేవాలయం ఎక్కడుందో, ఆ దేవాలయ విశిష్టత ఏమిటో తెలుసుకోండి…!

భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో గల వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం ప్రాంగణంలో భారతమాత దేవాలయం ఉంది. సంప్రదాయ దేవతల విగ్రహాలకు బదులుగా, ఈ ఆలయంలో పాలరాతితో చెక్కబడిన అఖండ భారతదేశ భారీ శిల్పం ఉంది. ఈ దేవాలయంలోని ప్రధాన ఆరాధ్య దైవం భారత మాత కాబట్టి దీన్ని భారత మాతకు అంకితం చేయబడింది. ప్రపంచంలోని భారత మాతకు చెందిన దేవాలయాలలో ఇదే మొట్టమొదటిది.

1936లో స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ శివప్రసాద్ గుప్తా చేత నిర్మించబడిన భారత మాతా మందిరాన్ని మహాత్మా గాంధీ ప్రారంభించారు.  ఇది అవిభాజ్య భారతదేశానికి ప్రతీకగా పాలరాతితో నిర్మించిన భారతమాత విగ్రహాన్ని కలిగి ఉంది. ఈ ఆలయంలో పాలరాతితో చెక్కబడిన భారతదేశం రిలీఫ్ మ్యాప్ ఉంది. మ్యాప్ లో పర్వతాలు, మైదానాలు, మహాసముద్రాలు కూడా గుర్తించబడ్డాయి.  వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్‌కు దక్షిణంగా 1.5 కిలోమీటర్ల దూరంలో, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉత్తరాన ఆరు కిలోమీటర్ల దూరంలో, ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి సమీపంలో ఈ భారత మాత ఆలయం ఉంది.